అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు. జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సెలవుల్లో భాగంగా బాన్సువాడలోని (Banswada) ఓ హాస్టల్లో విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లారు. తిరిగి జనవరి 18న విద్యార్థులంతా హాస్టల్‌కు చేరుకోగా.. ఓ విద్యార్థిని మాత్రం మూడురోజులు ఆలస్యంగా హాస్టల్‌కు వచ్చింది. అయితే అదేరోజు ఈ విద్యార్థినిని మెడికల్ చెకప్‌కు (Medical Checkup) తీసుకెళ్లాలని ఆమె బాబాయ్ కోరాడు. దీంతో అనుమానం వచ్చిన హాస్టల్ హెడ్‌మాస్టర్ విద్యార్థిని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడగా.. సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తండ్రి బలవంతంగా తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. వెంటనే హెడ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో విద్యార్థిని తండ్రిని నేరస్తుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం పోలీసులు కోర్టులో సాక్షాధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్ (District Judge Varaprasad) నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష రూ.30వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.