అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రైతు బజార్లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని రైతు బజార్లను శుక్రవారం ఆయన సందర్శించారు.
రైతు బజార్లను (Raithu bazar) కూరగాయల వర్తకులు వినియోగించడం లేదని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాలను ఆరా తీశారు. వినియోగదారులు లోపలికి రావడం లేదని, రోడ్లకు ఆనుకొని ఇరువైపులా ఉన్న దుకాణాల నుంచే కొనుగోలు చేస్తున్నారని, దీంతో రోడ్ల పక్కన విక్రయించాల్సి వస్తోందని వర్తకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే రోడ్ల పక్కన విక్రయాలు జరపడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. కచ్చితంగా రైతు బజార్లలోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Collector Nizamabad | నాణ్యతతో నిర్ణీత ధరలకే విక్రయించాలి
నిర్ణీత ధరలకు విక్రయిస్తూ నాణ్యత, శుభ్రత పాటిస్తే వినియోగదారులు వస్తారని కలెక్టర్ వర్తకులకు సూచించారు. పాత గంజ్ ప్రాంతంలో ఆక్రమణలను గుర్తించి, వాటిని తొలగించేందుకు డీ మార్కింగ్ చేయాలని ఆదేశించారు. అన్ని రైతుబజార్లు ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Collector Nizamabad | ట్యాంక్ నిర్మాణ పనుల పరిశీలన
అమృత్ పథకం (Amrit Scheme) కింద తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు నగరంలోని నాందేవ్‌వాడ, గౌతమ్ నగర్లో కొనసాగుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అంతకుముందు నాగారం 300 క్వార్టర్స్‌లోని బస్తీ దవాఖానాను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు.
అమృత్ స్కీంలో భాగంగా వాటర్‌ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి