అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Womens World Cup | భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 జోరుగా సాగుతోంది. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పాటు బంగ్లాదేశ్(Bangladesh) మహిళా జట్టు కూడా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటోంది.
నిగర్ సుల్తానా కెప్టెన్సీలో ఆ జట్టు మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్(Pakistan)పై విజయం సాధించి దుమ్ము రేపింది. అయితే గత రాత్రి సౌతాఫ్రికాపై కూడా గెలవాల్సి ఉన్నప్పటికీ చిన్న తప్పిదాల వలన ఓటమి పాలైంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ జట్టుకి సంబంధించిన ఒక వైరల్ ఫోటో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
Womens World Cup | పక్కా ఫేక్..
ఆ ఫోటోలో బురఖా ధరించిన ఇద్దరు మహిళలు మైదానంలో క్రికెట్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకరి చేతిలో బ్యాట్, మరొకరి చేతిలో బంతి ఉండగా, పైగా ఫోటోపై “ICC Women’s World Cup 2025” స్కోర్‌బోర్డ్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. దీంతో చాలా మంది యూజర్లు – “బంగ్లాదేశ్ మహిళా జట్టు నిజంగానే బురఖా వేసుకుని ఆడుతోందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (Twitter) లో ఈ ఫోటో విపరీతంగా షేర్ అవుతోంది. కొందరు ఇది బంగ్లాదేశ్‌లో జరిగిన లోకల్ టోర్నమెంట్ ఫోటో అని చెబుతుండగా, మరికొందరు బంగ్లాదేశ్ జట్టును ఆటపట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసిన ఫోటో అని అంటున్నారు.
కాని అసలు విషయం ఏంటంటే ఈ ఫోటో అసలైనది కాదు. బురఖా ధరించిన మహిళల ఫోటోకు ప్రపంచకప్ 2025(World Cup 2025) లోగో, స్కోర్‌బోర్డ్‌లను డిజిటల్‌గా జోడించారు. ఇది పూర్తిగా AI ఎడిటింగ్ లేదా ఫోటో మానిప్యులేషన్ ద్వారా సృష్టించిన ఫేక్ ఇమేజ్. బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్లు, ఇతర దేశాల క్రీడాకారిణుల మాదిరిగానే సాధారణ క్రికెట్ జెర్సీ, ప్యాడ్స్, హెల్మెట్, గ్లోవ్స్ ధరించి మైదానంలో ఆడుతున్నారు.ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్‌లోనూ వారు బురఖా ధరించి ఆడలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో తప్పుడు ప్రచారంలో భాగం మాత్రమే. ఇలాంటి ఫేక్ ఫోటోలు, తప్పుడు సమాచారం వలన క్రికెట్ జట్ల ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. కాబట్టి ఏ ఫోటో లేదా వీడియో షేర్ చేసే ముందు దాని నిజానిజాలు నిర్ధారించుకోవడం చాలా అవసరం.