అక్షరటుడే, భీమ్‌గల్ : Collector Nizamabad | కేజీబీవీలో పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులను పరిశీలించి, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
Collector Nizamabad | భద్రతపై ప్రత్యేక దృష్టి..
పాఠశాల ప్రహరీ తక్కువ ఎత్తులో ఉండడాన్ని గమనించిన కలెక్టర్.. బాలికల భద్రత దృష్ట్యా వెంటనే గోడ ఎత్తు పెంచాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలోకి కుక్కలు రాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్‌ను ఆదేశించారు. అన్ని కేజీబీవీలకు మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీరు అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
Collector Nizamabad | విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు..
బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థినులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆమె వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా (Sub-Collector Abhigyan Malviya), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఈవో అశోక్ తదితరులున్నారు.