అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Jathara | ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం జాతరకు (Medaram Jathara) ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మహా జాతరకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
దక్షిణ భారత కుంభమేళాగా (South Indian Kumbh Mela) పిలువబడే మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31 పాటు జరగనుంది. వన దేవతల దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మేడారం అడవులు (Medaram forests) భక్త జన సంద్రంగా మారనున్నాయి. పచ్చని అడవుల్లో అమ్మల దర్శనం కోసం వచ్చే ప్రజల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడానికి సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
Medaram Jathara | 42 వేల మంది సిబ్బంది
మేడారం మహా జాతర (Medaram Maha Jatara) సందర్భంగా 21 విభాగాలకు చెందిన 42,027 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వీరికి అదనంగా రెండు వేల మంది ఆదివాసీ వలంటీర్లు సేవలు అందిస్తారు. జాతర జరిగే ప్రాంతాన్ని మొత్తం 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. భక్తుల కోసం 27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు.
Medaram Jathara | 42 పార్కింగ్ ప్రాంతాలు
జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 42 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. వీటి కోసం ఏకంగా 1,418 ఎకరాలు కేటాయించారు. 4 వేల ఆర్టీసీ బస్సులు జాతర సందర్భంగా 51 వేల ట్రిప్పులు నడవనున్నాయి. 10,441 మంది RTC సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. భక్తుల కోసం 5,482 తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 119 డ్రెస్సింగ్ రూమ్‌లు, 5,700 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 5 వేల మంది పారిశుధ్య సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
Medaram Jathara | విద్యుత్ కోసం..
జాతరలో విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 911 స్తంభాలు ఏర్పాటు చేశారు. 28 బ్యాకప్ జనరేటర్లను సిద్ధంగా ఉంచారు. అలాగే 5,192 మంది వైద్య సిబ్బంది జాతరలో విధులు నిర్వహించనున్నారు. 30 అంబులెన్స్‌లు, 40 బైక్ అంబులెన్స్‌లు సేవలు అందించనున్నాయి. 210 మంది గజ ఈతగాళ్లు, 100 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.