అక్షరటుడే, వెబ్డెస్క్ : Fire Accident | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ పరిశ్రమలో పేలుడు చోటు చేసుకోవడంతో ఏడుగురు మృతి చెందారు.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బుధవారం అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది.
గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను ఫైరింజన్ల సాయంతో ఆర్పివేశారు.
Fire Accident | సజీవ దహనం
పేలుడు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో నిప్పు అంటుకొని ఆరుగురు సజీవ దహనం అయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 40 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలిసింది. పేలుడు ధాటికి పరిశ్రమ గోడ కూలిపోయింది.
Fire Accident | సీఎం దిగ్భ్రాంతి
బాణసంచా పేలుడు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu), హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. సహాయక చర్యలపై జిల్లా ఎస్పీ, అగ్ని మాపక శాఖ అధికారులతో మాట్లాడినట్లు హోం మంత్రి అనిత తెలిపారు.