అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. తమదైన వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతున్నాయి. ఎన్నికలో గెలువడం ద్వారా తమ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-Election)కు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. షేక్‌పేట తహసీల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నెల 15న బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయనుండగా, అదే రోజు లేదా తర్వాతి రోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. నేడో, రేపో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.
Jubilee Hills by-Election | నవంబర్ 14న ఓటింగ్..
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. 14వ తేదీన కౌంటింగ్ చేపట్టి, ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది.
సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ గురి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ప్రత్యేక దృష్టి సారించింది. సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ ఉప ఎన్నిక ద్వారా పార్టీ బలంగా ఉందన్న సంకేతాన్ని ఇచ్చేందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే సోమవారం రహమత్ నగర్‌లోని ఎస్‌పీఆర్ గ్రౌండ్స్ వద్ద విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్(KTR), హరీశ్‌రావు(Harish Rao), పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈనెల 15వ తేదీన అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇప్పటికే డివిజన్ల వారీగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించింది. ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నారో గుర్తిస్తూ ఆయా డివిజన్లపై ఫోకస్ సారించింది.
Jubilee Hills by-Election | కాంగ్రెస్ పార్టీకి సవాలే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అసలైన సవాలుగా మారింది. ఈ ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టనుంది. జూబ్లీహిల్స్‌పై జెండా ఎగురవేయడం ద్వారా తమ పాలనకు ప్రజామోదం ఉందన్న ప్రచారం చేసుకోవచ్చని కాంగ్రెస్ యోచిస్తోంది. అందుకోసమే సర్వశక్తులూ ఒడ్డుతోంది. అధికారంలో ఉండడం తమకు కలిసొస్తుందన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ(Congress Party).. ఎక్కడా పొరపాట్లు జరుగకుండా చూసుకుంటోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన తరహాలోనే ఈ ఎన్నికలో కూడా విజయం సాధించి మరింత పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. తద్వారా బీఆర్ఎస్, బీజేపీలను నిలువరించవచ్చని యోచిస్తోంది. గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.
Jubilee Hills by-Election | తేలని బీజేపీ అభ్యర్థి
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బీజేపీ.. ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుపొందిన జోష్‌లో ఉన్న కాషాయ పార్టీ(BJP Party).. జూబ్లీహిల్స్‌పై గురి పెట్టింది. అయితే అభ్యర్థిని ఇంకా ఖరారు చేయని బీజేపీ నాయకత్వం.. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. నేడో, రేపో అభ్యర్థి పేరును ప్రకటించిన కమల దళం.. ఆ వెంటనే రంగంలోకి దిగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రచారం కోసం జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించాలని యోచిస్తోంది.