అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vesey Pace | ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు, భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు డాక్టర్ వెసీ పేస్ (Vesey Pace) గురువారం ఉదయం కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో ఆయన కొంతకాలంగా పార్కిన్సన్ వ్యాధితో (Parkinson Disease) బాధపడుతున్నారు. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు ఈ వార్తను అధికారికంగా వెల్లడించారు. 1972లో మ్యూనిక్‌లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ జట్టుకు (Indian Hockey Team) ప్రాతినిధ్యం వహించిన వెసీ పేస్, బ్రోన్జ్ మెడల్ సాధించిన జట్టు సభ్యుల్లో ఒకరు.
Vesey Pace | విషాదం..
మిడ్‌ఫీల్డర్ పాత్రలో భారత హాకీకి కీలకంగా సేవలందించారు. భారత క్రీడా చరిత్రలో ఆయన పేరు గౌరవంగా నిలిచిపోతుంది. హాకీ లెజెండ్‌గానే కాకుండా, వెసీ పేస్ మరో ప్రముఖ క్రీడాకారుడు టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ (Leander Pace) తండ్రిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. తన కుమారుడు లియాండర్‌కు క్రీడలపై ప్రేమ, నిబద్ధత కలగడానికి వెసీ పేస్ జీవితం ఒక ఉదాహరణ. ఇక క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా, వెసీ పేస్ ఒక స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌గా కూడా అత్యున్నత స్థాయిలో సేవలందించారు.
ఆసియా క్రికెట్ మండలి, బీసీసీఐ, డేవిస్ కప్ జట్టుకు మెడికల్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అలాగే, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడా సంఘాలకు సలహాదారుగా ఉన్నారు. 1996 నుంచి 2022 వరకు ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియ్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. రగ్బీ క్రీడను దేశంలో అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది. ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ తదితర క్రీడల్లోనూ ఆయనకు మంచి ప్రావీణ్యం ఉండేది. అయితే వెసీ పేస్ మృతి భారత క్రీడా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు క్రీడా వర్గాలు. క్రీడా పరంగా ఎంతో మంది క్రీడాకారులకు మార్గదర్శిగా నిలిచిన వెసీ పేస్ సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.