అక్షరటుడే, బాల్కొండ: Cyber crime | సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ (Balkonda SI Shailender) పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు బాల్కొండ పోలీసులు మంగళవారం ఆయా గ్రామాల్లో విస్తృతస్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే బాల్కొండ పోలీస్ స్టేషన్ (Balkonda police station) పరిధిలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతం, వ్యాపార కేంద్రాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ ఈ ప్రచారాన్ని నిర్వహించారు.
Cyber crime | ఓటీపీలు చెప్పవద్దు..
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు అవసరమైన ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దన్నారు. అలాగే ఓటీపీలు ఎవరికి చెప్పవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నేపథ్యంలో కొంతమంది సోషల్ ఇంజినీరింగ్, మోసపూరిత ఫోన్‌కాల్స్, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త తరహా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘‘మీ కుటుంబ సభ్యులు డిజిటల్ అరెస్ట్ అయ్యారు.. వారిని విడిపించాలంటే వెంటనే డబ్బులు పంపాలి” వంటి డిమాండ్లు ఫోన్లలో వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదన్నారు. అలాంటి మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Cyber crime | మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలి
అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలు ఎదురయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు. అలాగే నేషనల్ సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు వాసుదేవ్, భాస్కర్, రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.