అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | నియోజకవర్గానికి వచ్చిన ప్రతిపైసా అభివృద్ధి కోసమే వెచ్చిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం (Party Office)లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత రెండేళ్లలో సుమారు రూ.130 కోట్ల నిధులు తీసుకురావడంలో తాను విజయం సాధించినట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను సీఎంకు నిరంతరం లేఖలు రాయడం.. అసెంబ్లీలో డిమాండ్ చేయడం ద్వారా నిధులను సాధించినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అవినీతి లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెడతానని హామీ ఇస్తున్నానన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.
MLA Dhanpal | ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం..
ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం రూ.కోటి చొప్పున నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక నిధుల కోసం తాను డిమాండ్ చేసిన రూ.100 కోట్ల ఎస్టిమేషన్లో, ప్రభుత్వం గత నెలలో రూ.37 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. నుడా ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ.23 కోట్లు, ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital) అభివృద్ధికి రూ.2.76 కోట్లు, డబుల్ బెడ్ రూమ్ల మరమ్మతు కోసం రూ1.25 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.
అలాగే ప్రగతినగర్ శ్మశాన వాటిక (Pragathinagar Crematorium) కోసం రూ.3.8 కోట్లు, ఎల్లమ్మ గుట్ట (Yellamma Gutta) సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర 8 ఏళ్లుగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.6 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వివరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, జిల్లా సెక్రెటరీ జ్యోతి వీరేందర్, మాస్టర్ శంకర్, ఆనంద్ రావు, మండల అధ్యక్షుడు నాగరాజు, ఇప్పకాయల కిషోర్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.