అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | భాష రాకున్నా భావాలతో సంభాషించడం అద్భుతమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం (Sign Language Day) సందర్బంగా డెఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ అధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తుల మధ్య సంభాషణకు భాష అవసరమన్నారు. అలాంటి భాషను వినలేని, మాట్లాడలేని బధిరులకు సమాచారాన్ని అర్థమయ్యే రీతిలో అందించేందుకు ఆవిర్భవించిందే సంకేత భాష విధానమని అన్నారు.
MLA Dhanpal | బాడీ లాంగ్వేజ్..
బాడీ లాంగ్వేజ్ (body language), శరీర కదలికలు, కనుబొమ్మలను కదపడం, ముఖ కవళికల ద్వారా ఎదుటి వ్యక్తితో సంభాషణ చేసే నైపుణ్యాన్ని సంకేత భాష అందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేళ్లు లేదా చేతి సంజ్ఞల ద్వారా మనసులోని భావాలను వ్యక్తపరచడం గొప్ప విషయమన్నారు.
2018 సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మొదటిసారిగా అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహించిందని స్పష్టం చేశారు. బాధిరుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేను కోరగా స్థలం, నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీడీపీవో సౌందర్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, భూపతి, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.