అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists | మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బల వెనుక కోవర్ట్ ఆపరేషన్ (covert operation) ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల కీలక నేతలు హతం అవుతున్నట్లు పార్టీ పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం (central government) 2026 మార్చి వరకు దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టి వేల సంఖ్యలో బలగాలతో అడవులను జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో వందలాది ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొని అనేక మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే గతంలో దళ సభ్యులు మాత్రమే ఎన్కౌంటర్లలో చనిపోయేవారు. ఇటీవల కీలక నేతలే లక్ష్యంగా బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు అగ్రనేతలను బలగాలు మట్టుబెట్టాయి.
Maoists | అప్పటి నుంచి..
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీ నంబాల కేశవరావు (Nambala Kesava Rao) మే 21న ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆయనతో పాటు 27 మంది ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే ఆయన ఎన్కౌంటర్ కూడా కోవర్ట్ ఆపరేషన్తోనే చేపట్టినట్లు పౌర హక్కుల సంఘాలు (civil rights groups) ఆరోపిస్తున్నాయి.
Maoists | నక్సల్స్ను పోలీసుల్లో చేర్పించిన నంబాల
మావోయిస్టులు, పోలీసులు ఇన్ఫార్మర్లను పెట్టుకోవడం, కోవర్టు ఆపరేషన్లు నిర్వహించడం చేస్తుంటారు. ఈ క్రమంలో నంబాల కేశవరావు తన దగ్గర పనిచేసే ఐదుగురిని ఛత్తీస్‌గఢ్ పోలీస్ DRGలో చేర్పించినట్లు సమాచారం. అనంతరం నంబాల దగ్గర పని చేసే ఇద్దరు నక్సల్స్ (Naxals) లొంగిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కోవర్ట్ ఆపరేషషన్ నిర్వహించినట్లు తెలిసింది. అంతేగాకుండా పోలీసుల ముసుగులో ఉన్న మావోయిస్టులను సైతం కనిపెట్టారు. అనంతరం వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Maoists | నంబాల కదలికలు కనిపెట్టి..
నంబాల ప్లాన్ తెలిసిపోవడంతో పోలీసులు, బలగాలు ఆయన కదలికలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో మే 21న జరిగిన ఎన్కౌంటర్లో ఆయనను హతమార్చాయి. తాజాగా మరో ఇద్దరు కీలక నేతలు సైతం కోవర్టు ఆపరేషన్తోనే మృతి చెందినట్లు నక్సల్స్ పేర్కొంటున్నారు. తెలంగాణకు (Telangana) చెందిన సత్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. కోవర్టు ఆపరేషన్తోనే బలగాలు ఎన్‌కౌంటర్లు చేపడుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.