అక్షరటుడే, వెబ్డెస్క్: Bijapur Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వాయువ్య బీజాపూర్ జిల్లాలోని అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్, కమాండర్ పాపారావు ఉన్నాడనే సమాచారం మేరకు బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్ DRG, STF, కోబ్రా సైనికుల ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Bijapur Encounter | కొనసాగుతున్న ఆపరేషన్
ఈ ఎన్‌కౌంటర్ నేషనల్ పార్క్ (National Park) ప్రాంతంలో జరుగుతోంది. ఇద్దరు నక్సల్స్ చనిపోయారని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీ (Maoist Party) బలహీనంగా మారింది. మార్చి 31లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ కగార్ (Operation Kagar) ధాటికి వందలాది మంది మావోలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. కీలక నేతలు హతం కావడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పలువురు మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోతున్నారు. ఇందులో పార్టీ అగ్రనేతలు ఉండటం గమనార్హం. దీంతో త్వరలో కేంద్ర ప్రభుత్వ (Central Government) లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.