అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించింది. అత్యవసర స్థితిలో 108 సిబ్బంది స్పందించి గర్భిణికి ప్రసవం చేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని (Gandhari Mandl) నాగులూర్ తండా గ్రామానికి చెందిన బస్సీ గంగకు ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబీకులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడ గంగను పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉండడంతో సీహెచ్‌సీ గాంధారి నుంచి కామారెడ్డికి (Kamareddy) రిఫర్ చేశారు. దీంతో 108 సిబ్బంది ఆమెను కామారెడ్డి జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో గర్భిణికి నొప్పులు ఎక్కువయ్యాయి.
దీంతో అంబులెన్స్ సిబ్బంది వాహనాన్ని నిలిపేసి.. ఆమెకు ప్రసవం చేశారు. గంగ పండంటి బిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో చురుకుగా స్పందించి తల్లీబిడ్డను కాపాడిని 108 ఈఎంటీ కమలాకర్, పైలెట్ సంజీవ్గౌడ్కు కుటుంబసభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.