అక్షరటుడే, కామారెడ్డి: DGP Shivdhar Reddy | ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) పేర్కొన్నారు. గురువారం ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో (Kamareddy district police office) ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సంసిద్దతను తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు ప్రత్యేక భద్రతా ప్రణాళికలు, బౌండోవర్ చర్యలు, చెక్‌పోస్టులు, ఎన్ఫోర్స్మెంట్ బృందాల పనితీరు, స్వాధీన వివరాలు, పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు మొబైల్ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ తదితర అంశాలను సమగ్రంగా వివరించారు.
DGP Shivdhar Reddy | డీఎస్పీలతో వివరాల సేకరణ..
జిల్లా పరిధిలోని డీఎస్పీలతో డీజీపీ స్వయంగా మాట్లాడి వారి పరిధిలోని భద్రతా ఏర్పాట్లు, సమస్యలు, ఫోర్స్ వినియోగంపై ప్రత్యక్ష వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను (local body elections) అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ప్రతీ ఒక్కరూ వారి ఓటుహక్కును ఎలాంటి ప్రలోభాలకు, భయబ్రాంతులకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని అధికారులకు గుర్తుచేశారు. జిల్లాలోని సున్నితమైన పోలింగ్ కేంద్రాల గ్రామాల వివరాలను అడిగి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే కార్యకలాపాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.
DGP Shivdhar Reddy | విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతిఒక్కరూ ఎన్నికల నియమనిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఎన్నికల అనంతరం ఆదేరోజు విజయోత్సవ ర్యాలీలలో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నందున ఎవరు ర్యాలీలు తీయరాదని తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ ఉన్నందున ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సందర్భంలో బైండోవర్ చేసిన వ్యక్తులలో ఐదుగురు ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించగా వారి పూచికత్తుగా చూపిన డబ్బులపై జరిమానా విధించబడిందన్నారు. బైండోవర్కే పరిమితం కాకుండా సంబంధిత నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించబడతుందని తెలిపారు. ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కామారెడ్డి అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, నిజామాబాద్ అదనపు కమిషనర్ బస్వారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఉమ్మడి జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.
