అక్షర టుడే, ఇందూరు : Collector Nizamabad | ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Vinay Krishna Reddy) మాట్లాడుతూ.. నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించవచ్చన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిక్షణా తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని, ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ (Election Commission) నిర్దేశించినందున అభ్యర్థులకు విషయాన్ని తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటీని, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకనుగుణంగా నిర్వహించాలని సూచించారు. సమయపాలన పక్కాగా పాటించాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందన్నారు.
అభ్యర్థి ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. తిరస్కరణకు ఎన్ని గురయ్యాయి అందుకు గల కారణాలు వెల్లడించాలని తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వాటికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్‌ను (Note Symbol) కూడా తప్పనిసరిగా చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, డీఎల్పీవో శ్రీనివాస్, ఆర్వోలు, సహాయ ఆర్వోలు పాల్గొన్నారు.