అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GST Reforms | వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలతో పాటు దసరా నవరాత్రుల సందర్భంగా కార్ల విక్రయాలు జోరందుకున్నాయి. సోమవారం నుంచే జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) అమలులోకి రావడం, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో తొలిరోజే వాహనాల విక్రయాలు అదరగొట్టాయి.
ఒక్కరోజే దేశవ్యాప్తంగా 30 వేల కార్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ వంటి కార్ల తయారీదారులు సెప్టెంబర్ 22న చారిత్రాత్మక విక్రయాలు నమోదు చేశాయి.
GST Reforms | 30 వేల మారుతీ కార్ల విక్రయం
సోమవారం ఒక్కరోజే మారుతి మోటార్స్ (Maruti Motors) దాదాపు 30,000 కార్లను డెలివరీ చేసింది. అలాగే, 80 వేల మంది బుకింగ్ కోసం షోరూంలను సందర్శించారు. ఈ స్థాయిలో ఒకరోజు విక్రయాలు జరగడం గత మూడు దశాబ్దాలలో ఇదే తొలిసారి అని మారుతీ మోటార్స్ తెలిపింది. ఇది అపూర్వమైన స్పందన అని పేర్కొంది. మరోవైపు, హ్యుందాయ్ నవరాత్రి ఉత్సాల్లో తొలిరోజున దాదాపు 11,000 వేల వాహనాలను విక్రయించింది. గత ఐదు సంవత్సరాలలో ఒకే రోజు అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టాటా మోటార్స్ (Tata Motors) కూడా దాదాపు 10,000 కార్లను డెలివరీ చేసింది. ఇది కంపెనీకి వ్యక్తిగత అత్యుత్తమం.
GST Reforms | జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన ధరలు..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో కీలక సంస్కరణు తీసుకొచ్చింది. గతంలో ఉన్న నాలుగు స్లాబులను రెండు స్లాబులకు కుదిరింది. ఆటోమోబైల్స్(Automobiles)పై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఒక్కో మాడల్‌పై కనిష్టంగా రూ.60 వేల నుంచి గరిష్టంగా 1.50 లక్షల వరకు రేట్లు తగ్గాయి. మరోవైపు, జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలను కస్టమర్లకే అందిస్తామని కార్ల తయారీ సంస్థలు ప్రకటించాయి. దీంతో వాహనప్రియులు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
22 నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రావడంతో తొలిరోజే షోరూంలకు పరుగులు పెట్టారు. దీంతో ఒక్క సోమవారమే 80 వేలకు పైగా వాహన విక్రయాలు జరిగాయి. “కస్టమర్ల నుంచి స్పందన అసాధారణంగా ఉంది. గత 35 సంవత్సరాలలో మేమెప్పుడు ఇంతటి ఆదరణ చూడలేదు. తొలిరోజు మేము 80,000 మంది కస్టమర్ ఎంక్వైరీలను నమోదు చేశాం” అని మారుతి మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.
దాదాపు 30,000 కార్లు డెలివరీ చేసినట్లు చెప్పారు. మారుతి చిన్న కార్లలో ఎస్-ప్రెస్సో ధరపై దాదాపు రూ.1.30 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఆల్టో Kl0పై రూ.1.08 లక్షల వరకు, సెలెరియో రూ.94,100 వరకు, వ్యాగన్ఆర్ రూ.79,600 వరకు, ఇగ్నిస్ రూ.71,300 వరకు, స్విఫ్ట్ రూ.84,600 వరకు, బాలెనో ధరలు రూ.86,100 వరకు తగ్గాయి. SUVల విషయానికొస్తే, ఫ్రాంక్స్ రూ.1.13 లక్షల వరకు, బ్రెజ్జాలో రూ.1.13 లక్షల వరకు, గ్రాండ్ విటారాపై రూ.1.07 లక్షల వరకు, జిమ్నీపై రూ.51,900 వరకు ధర తగ్గింపు జరిగింది. డిజైర్ సెడాన్ రూ.87,700 వరకు, ఎర్టిగా MPVపై రూ.46,400 వరకు ధర తగ్గింది.
మరోవైపు, హ్యూందాయ్ కూడా తన కార్లపై రూ.60 వేల నుంచి రూ.2.40లక్షల వరకు ధరలు తగ్గించింది. ఇక, టాటా మోటార్స్ కూడా జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తోంది. దీంతో ఆ సంస్థకు సంబంధించిన కార్ల ధరలు రూ.70 వేల నుంచి రూ.3 లక్షల దాకా తగ్గుముఖం పట్టాయి. SUV లలో, కొనుగోలుదారులు పంచ్‌పై రూ. 1.58 లక్షల వరకు, నెక్సాన్‌పై రూ. 2 లక్షల వరకు, కర్వ్‌పై రూ. 1.07 లక్షల వరకు, హారియర్‌పై రూ. 1.94 లక్షల వరకు మరియు రూ. 1.98 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో కొనుగోలుదారులు షోరూంల బాట పట్టారు.