అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | చదువు మాత్రమే జీవితాన్ని మారుస్తుందని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar district) జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ (Triple IT) నిర్మాణానికి భూమిపూజ చేశారు.
సీఎం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలని సూచించారు. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విద్య సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుందని తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సివిల్స్ రాసేవారిని (Civil Services examination) ప్రోత్సహించేందుకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన యువతకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులను మరువొద్దు
ఎంత ఎదిగినా తల్లిదండ్రులను, పుట్టిన ఊరును మరువొద్దని సీఎం సూచించారు. భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉందన్నారు. 25 ఏళ్ల వరకు కష్టపడి చదువుకుంటే.. సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు జమీందార్లు, జాగీర్దార్ల వద్ద ఉన్న భూములను తీసుకుని భూమిలేని నిరుపేదలకు పంచారన్నారు. పేదలకు పంచేందుకు ఇప్పుడు భూములు లేవన్నారు. ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్య మాత్రమే అని పేర్కొన్నారు. చిట్టబోయినపల్లిలో ఐఐఐటీ భవనం ఏడాదిలోగా పూర్తవుతుందన్నారు. తాను 17 ఏళ్ల వ్యవధిలో అన్ని చట్టసభల్లో పని చేసినట్లు చెప్పారు. విజయం సాధించాలంటే పట్టుదల ఉండాలని ఆయన సూచించారు.