అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Falcon Case | ఫాల్కన్ కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్వాధీనం చేసుకున్న విమానాన్ని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)లో విమానానికి డిసెంబర్ 9న అధికారులు ఆన్లైన్లో వేలం నిర్వహించనున్నారు.
బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచిన హాకర్ 800A విమానాన్ని వేలం వేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్ N935H కలిగిన ఈ విమానం డిసెంబర్ 7 వరకు తనిఖీ కోసం అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9న MSTC లిమిటెడ్ ద్వారా వేలం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ డబ్బును మోసానికి గురైన బాధితులకు పరిహారం చెల్లించడానికి ఉపయోగించనున్నారు.
Falcon Case | రూ.792 కోట్ల మోసం
ఇన్‌వాయిస్-డిస్కౌంటింగ్ పేరుతో ఫాల్కన్ గ్రూప్ (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్), దాని CMD అమర్‌దీప్ కుమార్‌పై ఫిబ్రవరి 11న సైబరాబాద్ (Cyberabad) ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో పెట్టుబడిదారులను రూ.792 కోట్లకు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. అమర్‌దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నిర్వహించిన సోదాల సమయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)లో మార్చి 7న అధికారులు విమానాన్ని సీజ్ చేశారు.
Falcon Case | ముగ్గురి అరెస్ట్
ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి ముందే అమర్‌దీప్ కుమార్ అదే విమానాన్ని ఉపయోగించి దేశం విడిచి పారిపోయాడు. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు రూ.18.63 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. అమర్‌దీప్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీవోవో ఆర్యన్ సింగ్ ఛబ్రాను అదుపులోకి తీసుకుంది.
Falcon Case | వేలానికి అనుమతి లభించడంతో..
ఈ కేసులో స్వాధీనం చేసుకున్న విమానాన్ని అమర్‌దీప్ కుమార్ 2024లో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. దానిని స్వాధీనం చేసుకున్న తర్వాత వేలం వేయడానికి అడ్జుడికేటింగ్ అథారిటీ (Adjudicating Authority) ని అనుమతి కోరింది. నవంబర్ 20 వేలానికి ఆమోదం లభించింది. దీంతో ఈ నెల 9న ఆన్లైన్లో వేలంపాట నిర్వహించనున్నారు.
