అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Liquor Scam | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం (YSRCP Government) అమలు చేసిన మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున నగదు దారి మళ్లినట్టు ఆధారాలు లభించడంతో ఈ కేసులోకి ఈడీ రంగంలోకి దిగింది.
AP Liquor Scam | ఈడీ సమన్లు..
మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును చేపట్టిన ఈడీ ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారులు, వ్యాపారవర్గాలకు చెందిన వ్యక్తులను ప్రశ్నించింది. అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించి, బ్లాక్ మనీని వైట్‌గా మార్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఆ నిధులను ఎన్నికల ఖర్చుల కోసం వినియోగించారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy)ని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిట్ అందించిన ఆధారాలను ఇప్పటికే అధ్యయనం చేసిన ఈడీ, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా నగదు లావాదేవీలు ఎలా జరిగాయి, మద్యం పాలసీ రూపకల్పనలో ఎవరి పాత్ర ఎంత వరకు ఉంది, అమలు దశలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాలపై స్పష్టత రాబట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా నగదు రూపంలోనే వ్యాపారం ఎందుకు సాగిందన్న అంశంపై లోతుగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ లోపలి అవమానాల కారణంగా గతంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన ఆయన, ఆ తర్వాత రాజకీయాలపై స్పందించడం మానేశారు. వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. అయినప్పటికీ, గత ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో వివిధ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఆయనను విచారిస్తున్నాయి. ఇంతకుముందు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ లిక్కర్ కేసులోనే విజయసాయిరెడ్డిని పలుమార్లు ప్రశ్నించింది. అలాగే కాకినాడ పోర్టు వ్యవహారం, జగన్‌కు సంబంధించిన కేసుల్లో కూడా ఆయన ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఈడీ ఎదుట హాజరుకానుండటంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేడెక్కనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.