Homeలైఫ్​స్టైల్​Dasshera | చెడుపై మంచి విజయం.. తెలంగాణలో దసరా సంబురాలు - పాలపిట్ట ప్రత్యేకత

Dasshera | చెడుపై మంచి విజయం.. తెలంగాణలో దసరా సంబురాలు – పాలపిట్ట ప్రత్యేకత

అక్షరటుడే, హైదరాబాద్ : Dasshera | తెలంగాణ ప్రజలకు దసరా లేక విజయదశమి అత్యంత ముఖ్యమైన, పెద్ద పండుగ. తొమ్మిది రోజుల పాటు శక్తి స్వరూపిణి దుర్గామాతకు నవరాత్రి పూజలు చేసి, పదవ రోజున ఈ విజయాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అన్యాయంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయాన్ని దసరా పండుగ సూచిస్తుంది. తెలంగాణలో నవరాత్రి ఉత్సవాలు(Navratri Celebrations) బతుకమ్మ సంబురాలతో ముడిపడి ఉంటాయి. చివరి రోజున సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించి, అమ్మవారిని గంగమ్మ ఒడికి సాగనంపుతారు.

Dasshera | పాలపిట్ట దర్శనం – విజయానికి చిహ్నం:

దసరా పండుగలో తెలంగాణ సంస్కృతి(Telangana Culture)కి అద్దం పట్టే అంశం పాలపిట్ట (నీలకంఠం) దర్శనం. దీనిని శుభశకునంగా, విజయం సిద్ధిస్తుందని నమ్మకంతో చూస్తారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు, మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో పాలపిట్ట(Palapitta) దర్శనం కావడం వారికి విజయాలను చేకూర్చింది. అందుకే, దసరా సాయంత్రం వేళ ప్రతి ఒక్కరూ పట్టణాల్లో, గ్రామాల్లోని పొలాల వైపు వెళ్లి పాలపిట్టను తప్పకుండా చూస్తారు. ఈ పక్షికి ఉన్న విశిష్టత కారణంగానే తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పక్షిగా ప్రకటించింది.

Dasshera | శమీ పూజ, అలయ్ బలయ్ సంప్రదాయం:

విజయదశమి(Vijayadashami) రోజున శమీ వృక్షం (జమ్మి చెట్టు)కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జమ్మి ఆకులను బంగారంగా భావించి, పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే వాహనాలు, వ్యవసాయ పనిముట్లకు ఆయుధ పూజ చేస్తారు. ఈ పండుగలో ఇంకో ప్రత్యేకత, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకునే ‘అలయ్ బలయ్’ సంప్రదాయం. ఈ ఆచారం బంధుమిత్రులను, శత్రువులను కూడా కలుపుకునిపోయి, పండుగ వాతావరణాన్ని మరింత పటిష్టం చేస్తుంది. మొత్తం మీద దసరా తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు, విజయాలను ఏకతాటిపై తెచ్చే మహోత్తర పండుగ.