అక్షర టుడే, కోటగిరి: Kotagiri Mandal | డబుల్ బెడ్రూం ఇళ్ల బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కోటగిరి మండల (Kotagiri Mandal) కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా.. స్పందించడం లేదన్నారు. రెండేళ్లుగా బిల్లులు లేక లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఒకరి బిల్లులను మరొకరికి ఇచ్చి డబుల్ బెడ్రూం బిల్లుల (double bedroom bills) చెల్లింపులో అవినీతికి పాల్పడ్డారని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో ఓట్ల కోసం నాయకులు తమ అనుచరులకు డబుల్ బెడ్ రూం బిల్లులను అందించారని, అర్హులైన లబ్ధిదారులకు మాత్రం బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు.
Kotagiri Mandal | విచారణ జరిపించాలి
ఈ వ్యవహారంపై కాంట్రాక్టర్, మాజీ ప్రజాప్రతినిధుల పాత్రపై విచారణ (investigation) జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెలాఖరుకు హౌసింగ్ శాఖ అధికారి నాగేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారని, వెంటనే లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు 23 మందికి మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎవరెవరికి ఎన్ని బిల్లులు రావాలో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
సుమారు 100 మంది వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. బిల్లులు ఇవ్వకుండా మాయమాటలు చెబుతున్నారని, కొందరు ప్రజాప్రతినిధులు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు యముల నవీన్, పుల్లెల మోహన్, సమీర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.