అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | మున్సిపల్ అథారిటీ లేకుండా అనధికార మ్యాప్ చూపించి చిరు వ్యాపారులను ఆగం చేయవద్దని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నూతన మడిగెలు పూర్తయ్యాకే వారిని తరలించాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న మడిగెలు ఖాళీ చేసే అంశంపై నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర రైల్వే మంత్రితో అమృత్ పథకం ద్వారా కామారెడ్డి రైల్వే స్టేషన్ (Kamareddy Railway Station) పునర్నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నామని శనివారం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేర్కొన్నారన్నారు. అయితే రైల్వేస్టేషన్‌ను ఆనుకుని 90 నుంచి 100 మడిగెల్లో 40 ఏళ్లుగా పలువురు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారని, మున్సిపాలిటీ (Municipality)కి పన్ను ద్వారా లక్షల్లో ఆదాయం వస్తోందన్నారు. అలాంటి వ్యాపారులను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడం సరికాదన్నారు.పొట్టి శ్రీరాములు విగ్రహం, గంజ్ స్కూల్ వద్ద మున్సిపల్ స్థలలాలో మడిగెలు నిర్మించి అక్కడ వ్యాపారులకు మడిగెలు కేటాయిస్తామని ఎమ్మెల్యే చెప్పారని, కామారెడ్డి అభివృద్ధికి తాము ముందుండి సహకరిస్తామని పేర్కొన్నారు. అయితే వ్యాపారులకు మడిగెలు కేటాయించడానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. 2 నెలల్లో మడిగెల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే చెప్పారని, అది సాధ్యమేనా అని అనుమానం వ్యక్తం చేశారు.
Kamareddy | అధికారిక మ్యాప్ కాదు..
రైల్వే స్టేషన్ పనుల పరిశీలిన సమయంలో ఎమ్మెల్యే ఒక మ్యాప్ చూపించారని, అది అధికారిక మ్యాప్ కాదని, ఎమ్మెల్యే సొంతంగా తయారు చేసిన మ్యాప్ అని తెలిపారు. మున్సిపల్ నిధుల ద్వారానే మడిగెల నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారని, అసలు మున్సిపల్ లో నిధులు ఎన్ని ఉన్నాయి. మున్సిపల్ ఆర్థిక పరిస్థితి ఏమిటో ముందుగా పత్రికాముఖంగా తెలియజేయాలని సూచించారు. మున్సిపాలిటీలో నెలవారీ జీతాలకే కష్టంగా ఉందని, మూడేళ్లుగా కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. మడిగెల నిర్మాణ ప్రతిపాదనకు అధికారులు, సంబంధిత శాఖ చూస్తున్న సీఎం అనుమతి కావాలని, ఇవన్నీ కాకుండా నిర్మాణం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
Kamareddy | ముందుగా మడిగెల నిర్మాణం చేపట్టాలి..
నిజంగా వీధి వ్యాపారులకు న్యాయం చేయాలనుకుంటే ముందుగా మడిగెలు నిర్మించాలని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే నంబర్ 6లో స్థలం స్వాధీనం చేసుకోవడానికి ఎమ్మెల్యేకు రెండేళ్లు పట్టిందని, ఇప్పటికైనా స్వాధీనం చేసుకున్నందుకు సంతోషమన్నారు. సర్వే నంబర్ 6లో 12 మంది గుడిసెలు వేసుకుని ఉంటున్న బాధితులను ఖాళీ చేసే ముందు సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా చేయకపోవడంతో బాధితులు రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌కు ఆనుకుని ఉన్న వ్యాపారుల పరిస్థితి అలా కాకుండా ఉండేందుకు ముందుగా మడిగెలు నిర్మించి దుకాణాలు అలాట్ చేసిన తర్వాతే తరలించాలన్నారు. అలా కాదని దౌర్జన్యంగా తరలించాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని, సమస్య పరిష్కారం కోసం న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. రైల్వే మడిగెల ప్రాంతంలో వర్షం పడితే వారం రోజుల పాటు నీరు నిల్వ ఉంటుందని, అక్కడ పెద్ద డ్రెయినేజీ నిర్మించాలని ఎమ్మెల్యేకు సూచించారు.
Kamareddy | అభివృద్ధి, సంక్షేమంలో ప్రభుత్వం ముందంజ
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుందని, ఈ రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో ప్రభుత్వం ముందంజలో ఉందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఫలితంగా మరింత వేగంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఉరుదొండ రవి, పంపరి శ్రీనివాస్, గడ్డమీది మహేష్, మామిండ్ల రమేష్, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్, చాట్ల వంశీకృష్ణ, సలీం, శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.