అక్షరటుడే ఆర్మూర్ : Seed Development Corporation | అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ విత్తనాలను కొనుగోలు చేయవద్దని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి (Chairman Anvesh Reddy) రైతులకు సూచించారు. ఆర్మూర్, నందిపేట మండల్లాల్లోని మంథని, కుద్వాన్పూర్ గ్రామాలలో రైతులతో ఆయన శనివారం సమావేశాలు నిర్వహించారు.
ఈ యాసంగి సీజన్లో విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు వాడాలని రైతులకు సూచించారు. విత్తనాభివృద్ధి సంస్థ రైతుల (Farmers) కోసం ఏర్పాటు చేసిన సంస్థ అని దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుందని, అలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు వాడకుండా ప్రైవేట్ విత్తనాలు (Private Seeds) వాడడం సరి కాదన్నారు. రకరకాల మాయమాటలతో ప్రైవేట్ విత్తన కంపెనీలు చెప్పే మాటలకు మోసపోవద్దని రైతులకు సూచించారు.
ప్రస్తుత యాసంగి సీజన్ (Yasangi Season)కు సంబంధించిన విత్తనాల లభ్యత, సాగుచేసే పంటలు, రకాలు అంశాలపై వివరంగా చర్చించారు. నాణ్యమైన ధృవీకరిత విత్తనాల వినియోగం ద్వారా పంటలు వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడమే కాకుండా, అధిక దిగుబడులు సాధించి రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను సమయానికి, సరఫరాలో అంతరాయం లేకుండా అందించే బాధ్యతను విత్తనాభివృద్ధి సంస్థ పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయన్నారు. మార్కెట్‌లో విత్తనాల ధరలను నియంత్రించేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఆలూర్ పాక్స్ సందర్శన..
ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్)ను (PACS), కొనుగోలు కేంద్రాన్ని శనివారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తూకాలు, చెల్లింపుల విధానాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వేగంగా తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా నాయకులు అన్వేష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైఎస్ మల్లారెడ్డి, ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, సీఈఓ మల్లేష్, సీనియర్ నాయకులు మూలకిడి శ్రీనివాస్ రెడ్డి, కల్లెం భోజారెడ్డి, దేగాం శ్రీనివాస్ గౌడ్, కిషన్, గంగారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

