అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Siddaramaiah | కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాల నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు.
సీఎం మార్పుపై కొంత కాలంగా తీవ్ర గందరగోళం నెలకొన్న తరుణంలో ఉప ముఖ్యమంత్రి డీకే నివాసంలో మంగళవారం అల్పాహార భేటీ జరిగింది. సిద్దు, శివకుమార్ ఇలా భేటీ కావడం ఇది రెండోసారి. సమావేశం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. “డీకే శివకుమార్, నేను ఐక్యంగా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. భవిష్యత్తులో కూడా మేము ప్రభుత్వాన్ని ఐక్యంగా నడుపుతాం..” అని ఆయన పేర్కొన్నారు.
CM Siddaramaiah | ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం..
అల్పాహార భేటీలో తాను, డిప్యూటీ సీఎం పార్టీ అంతర్గత విషయాలతో పాటు డిసెంబర్ 8 నుండి జరిగే శాసనసభ సమావేశాలకు సంబంధించిన వ్యూహాన్ని చర్చించామని కూడా చెప్పారు. అయితే, శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారని అడిగినప్పుడు, సిద్ధరామయ్య, “హైకమాండ్ (High Command) చెప్పినప్పుడు…” అని బదులిచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు న్యూఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారని సిద్ధరామయ్య అన్నారు. “హైకమాండ్, ముఖ్యంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీసుకున్న నిర్ణయాన్ని మేమిద్దరం అంగీకరిస్తాం. వారు (పార్టీ హైకమాండ్) మమ్మల్ని (ఢిల్లీకి) పిలిస్తే, మేం కచ్చితంగా వెళ్తాం. రేపు మా ఇద్దరినీ ఆహ్వానించే కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్‌ను కలుస్తున్నాను” అని సీఎం వివరించారు.
CM Siddaramaiah | అంతా కలిసే ఉన్నాం..
కర్ణాటక ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా ఉన్నారని, ప్రతిపక్షాలను కలిసి ఎదుర్కొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. “మేం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉన్నాం, మేమంతా సోదరులం. కలిసి పనిచేస్తున్నాం” అని సిద్ధరామయ్య అన్నారు. ముఖ్యమంత్రి గతంలో శివకుమార్‌ను తన నివాసంలో అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఆ రోజు ఇడ్లీ-సాంబార్, ఉప్మా వడ్డించగా, తాజాగా డీకే తన నివాసంలో సాంప్రదాయ అల్పాహారమైన చికెన్, ఇడ్లీతో సిద్ధరామయ్యకు ఆతిథ్యం ఇచ్చారు.
