అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jagadish Reddy | సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అందుకే తమకు అనుకూలంగా ఉన్న మీడియాల్లో కథనాలు వస్తున్నాయని ఆరోపించారు.
ఏబీఎన్ రాధాకృష్ణ తొలిపలుకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్టీవీలో అధికారులు, మంత్రుల పేర్లు చెప్పకుండా వార్త ప్రసారం చేశారని, కానీ ఏబీఎన్‌లో అందరి పేర్లు చెప్పారన్నారు. దీనిపై సిట్ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Jagadish Reddy | ఎందుకు రద్దు చేశారు
ఒక మీడియాలో మంత్రులు, ఐఏఎస్ అధికారాల మీద కథనాలు వస్తాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇంకొక మీడియాలో ఆ కథనానికి విరుద్ధంగా రాస్తారని రాధాకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వార్త కథనం ప్రచురితం కాగానే.. డిప్యూటీ సీఎం టెండర్లు రద్దు చేయమని చెప్పారని పేర్కొన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పారదర్శకంగా నడుస్తుందని చెప్పారన్నారు. పారదర్శకంగా నడిచే ప్రభుత్వమే అయితే ఉప ముఖ్యమంత్రి ఆ టెండర్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.
Jagadish Reddy | అందుకే డీఏ విడుదల
మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెబుతారనే భయంతో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన స్లాటర్ హౌస్‌లే ఇవ్వాళ వారి పాలిట శాపాలయ్యాయని మీడియా సంస్థలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఏ గతి పట్టిందో.. రేవంత్ రెడ్డికి అంతకంటే అధ్వానమైన గతి పడుతుందన్నారు. వాటా అడుగుతున్నారని మంత్రుల మీద సీఎం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీవీ కథనంతో జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. గతంలో కేటీఆర్, హరీష్ రావు, తన మీద ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కంప్లైంట్ పంపిస్తే కూడా చర్యలు తీసుకోలేదన్నారు.
Jagadish Reddy | ప్రజలు బొంద పెట్టారు
చంద్రబాబు కూడా సీఎం రేవంత్‌రెడ్డి లెక్కనే ప్రగల్భాలు పలికితే తెలంగాణ ప్రజలు బొంద పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ (New Year) సందర్భంగా ఏ రెండు మీడియా ఛానల్ ఓనర్ల కాళ్లు మొక్కిండో రెండు వివాదాస్పద కథనాలు అవే ఛానల్లో వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇట్ల వరుసగా ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రుల మీదనే ఎందుకు కథనాలు వస్తున్నాయని వారు బాధ పడుతున్నట్లు జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి టు మోడీ వయా చంద్రబాబు నాయుడు అన్నట్లు ఉంది వ్యవహారం అని ఎద్దేవా చేశారు. ఈరోజు ఖమ్మం సభలో టీడీపీ జెండాలు పెట్టి అదే నిరూపించారన్నారు.