అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సోమవారం ధరణి వెంచర్ లో ఇళ్లు కొనుగోలు చేసిన బాధితులు జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్(Rotary Club)లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అప్పటి కలెక్టర్ ఈ వెంచర్ ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని, ఉద్యోగులు, వ్యాపారస్తులతో బలవంతంగా కొనుగోలు చేయించారన్నారు. కానీ వెంచర్ లో కనీస వసతులైన నీరు, కరెంటు, రోడ్లు, ఇతర సౌకర్యాలను ఆరు నెలల్లో సమకూరుస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇండ్లు, ప్లాట్లపై రుణాలు తీసుకుని కట్టలేక, వసతులు లేని ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి న్యాయం చేయాలని కోరారు. వసతులు కల్పించకుండా మిగిలిన ప్లాట్లు, ఇళ్లను వేలం వేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.
