అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dharani Scam | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి పోర్టల్ స్కామ్‌లో (Bhu Bharati portal scam) పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వరంగల్ సీపీ సన్ ప్రీత్‌సింగ్ (Warangal CP Sunpreet Singh) శుక్రవారం వివరాలు వెల్లడించారు.
భూముల రిజిస్ట్రేషన్ల కోసం బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ (Dharani portal) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని భూ భారతిగా మార్చారు. కొంతమంది ముఠాగా ఏర్పడి అధునిక సాంకేతికతతో ధరణి, భూ భారతి పోర్టల్‌లో మోసాలకు పాల్పడ్డారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయంలో అసలు ఫీజు కంటే తక్కువ చెల్లించేవారు. అనంతరం రిసిప్ట్‌ను ఎడిట్ చేసి పూర్తి ఫీజు చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించేవారు. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) కేంద్రంగా ఈ ముఠా మోసాలకు పాల్పడింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ఇటీవల ఈ వ్యవహారం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Dharani Scam | పరారీలో 9 మంది
ఈ కేసులో 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. మరో 9 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. భువనగిరి జిల్లాకు చెందిన ఆన్‌లైన్ సర్వీస్ నిర్వాహకులు పసునూరి బసవరాజు, జెల్ల పాండులను ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో గతంలో అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. యాదగిరిగుట్టలోని ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. దీంతో రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.
Dharani Scam | రూ.63 లక్షలు స్వాధీనం
రెండు జిల్లాల్లో కలిపి నిందితులు 1,080 రిజిస్ట్రేషన్లలో మోసాలకు పాల్పడ్డారు. వీరు సొంతంగా స్లాట్ బుక్ చేయడంతో పాటు ఇతర ఆన్‌లైన్ సెంటర్ల నిర్వాహకులకు సైతం 10 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తూ స్లాట్ బుకింగ్‌లు చేయించేవారు. దీనిపై జనగామలో 7, భువనగిరి జిల్లాలో 15 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తాజాగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, రూ.63.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటి విలువైన ఆస్తుల పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.