అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి నియోజకవర్గ (Kamareddy constituency) అభివృద్దే తనకు ముఖ్యమని, ప్రొటోకాల్‌తో తనకు పనిలేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో రూ.240 కోట్లతో 105 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేసి కామారెడ్డికి గోదావరి జలాలను తీసుకొచ్చానన్నారు. పనులు చేపట్టి 20 ఏళ్లు కావడంతో అక్కడక్కడా టెక్నికల్ సమస్యలతో పైప్లైన్లు పగిలిపోయి ఇబ్బంది అయ్యిందన్నారు.
Shabbir Ali | గోదావరి నీళ్లు వస్తే..
కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తే (Shabbir Ali) తనకు ఎక్కడ పేరు వస్తుందోనని.. గత ఎమ్మెల్యే పక్కవాళ్లు నీళ్లను తీసుకుపోతుంటే కూడా అడ్డు చెప్పలేదని షబ్బీర్‌అలీ విమర్శించారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఈ పనులు కంటిన్యూ చేయాలని.. సీఎంను అడిగి రూ.195 కోట్లు మంజూరు చేయించానన్నారు. టెండర్లు కూడా పూర్తయి పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. 37 కి.మీ పైప్‌లైన్ రిపేర్ చేయాల్సి ఉంటే 29 కిలోమీటర్లు పూర్తయ్యాయని, 4.8 కి.మీ ఇందల్వాయి ఫారెస్ట్ సమస్యతో ఆగిపోతే ఆ సమస్య కూడా పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఫిబ్రవరి 28 తేదీలోపు పనులు పూర్తి చేస్తామని మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు (Mission Bhagiratha RWS officials) చెప్పారని తెలిపారు.
Shabbir Ali | కామారెడ్డిలో తీరనున్న తాగునీటి సమస్య..
కామారెడ్డికి 10 ఎంఎల్డీ నీళ్లు రాబోతున్నాయని, కామారెడ్డితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని షబ్బీర్‌అలీ అన్నారు. కామారెడ్డిలో నీటి సమస్య (water problem) తీరబోతుందని పేర్కొన్నారు. మొదటిసారి గోదావరి జలాలు తానే తెచ్చానని, 20 ఏళ్ల తర్వాత రెండోసారి తానే మళ్లీ గోదావరి జలాలు తీసుకువస్తున్నానని, ఇది తన రెండవ విజయమని చెప్పారు. టుఫిడ్ కో కింద గతంలో రూ.28 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో రూ.8 కోట్లు ఇండోర్ స్టేడియానికి కేటాయించడం జరిగిందన్నారు. ఇటీవల మంత్రి సీతక్క స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారన్నారు. అయితే పనులు చేపట్టడానికి 28 గుంటల స్థలం తక్కువైందని, పక్కనే ఉన్నవిద్యాశాఖకు సంబంధించిన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరడం జరిగిందన్నారు. ఆ ఫైల్ సీఎం దగ్గర పెట్టి స్థలం అలాట్ చేయిస్తామని తెలిపారు.
Shabbir Ali | విశాలంగా ఇండోర్ స్టేడియం..
ఇండోర్ స్టేడియం 35 ఫీట్ల వెడల్పు, 65 ఫీట్ల పొడవుతో నిర్మాణం కాబోతుందని, ఇందులో 4 షటిల్ గ్రౌండ్స్, 2 బాస్కెట్ బాల్ గ్రౌండ్స్, ఒక రైఫిల్ షూట్ గ్రౌండ్ ఉంటాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా వారిని క్రీడల వైపు దృష్టి సారించేలా చేస్తామని తెలిపారు. డెయిరీ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం హైవే రోడ్డు నుంచి వర్షం పడితే నీళ్లు రాకుండా రూ.69 లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కళాశాలలో దొడ్లే డెయిరీ వారి సహకారంతో రూ.4.5 కోట్లతో పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. అలాగే తాను చదువుకున్న జిల్లాపరిషత్ బాయ్స్ హైస్కూల్ నూతన భవనం నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
Shabbir Ali | అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్లు..
రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో పనులు మొదలయ్యాయని, కామారెడ్డి ఎమ్మెల్యే తీరుతో ఇక్కడ పనులు ఇంకా ప్రారంభించలేదన్నారు. ఇక్కడ పనుల ప్రారంభోత్సవం చేయడానికి ఎమ్మెల్యే సమయం కోసం డిప్యూటీ సీఎం వెయిట్ చేస్తున్నారని, అధికారులు ఎమ్మెల్యే సమయం ఇవ్వాలని వెళ్తే రేపుమాపు అంటూ సమయం ఇవ్వడం లేదన్నారు. ఎమ్మెల్యే సమయం ఇస్తే రూ.6 కోట్లతో వెయ్యి గజాలలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు.
Shabbir Ali | ప్రొటోకాల్ ఫిర్యాదులతో..
ఎమ్మెల్యే ప్రొటోకాల్ ఫిర్యాదులతో.. తాము అధికారంలో ఉండి కూడా కామారెడ్డి నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని షబ్బీర్ అలీ తెలిపారు. ఇకపై ఎవరు అడ్డుపడినా అభివృద్ధి ఆగదని చెప్పారు. నిజామాబాద్ ఎమ్మెల్యే సహకరిస్తుండడంతో రూ. వందల కోట్ల నిధులు వస్తున్నాయని, ఇక్కడి ఎమ్మెల్యే తన శిష్యుడే అయినా సహకరించడం లేదన్నారు. కామారెడ్డి జిల్లా రద్దు కాదని, ఒక్క మండలం కూడా పోదన్నారు. జిల్లాల పునర్విభజనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. దోమకొండను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని డిమాండ్ వచ్చిందని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
Shabbir Ali | పట్టణ అభివృద్ధికి రూ.18.7 కోట్లు మంజూరు
కామారెడ్డి పట్టణ అభివృద్ధికి రూ.18.7 కోట్లు మంజూరయ్యాయని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కల్కినగర్, టీచర్స్ కాలనీ ఇతర ప్రాంతాల్లో రూ.8.80 కోట్లతో నీటి కాలువల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రూ.కోటితో నిజాంసాగర్ చౌరస్తా వద్ద జంక్షన్ అభివృద్ధి చేపట్టనున్నామని, రూ.2 కోట్ల వ్యయంతో రామేశ్వరపల్లిలోని ఇందిరా నగర్, పట్టణంలోని ఇతర ప్రదేశాలలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు.
అలాగే రూ.1.59 కోట్లతో వినాయక నగర్, దేవి విహార్, ఎన్జీవోస్ కాలనీతో పాటు ఇతర ప్రదేశాలలో బయో-డైవర్సిటీ పార్క్ అభివృద్ధి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రూ.80 లక్షల వ్యయంతో రాజీవ్ పార్క్ కాంపౌండ్ వాల్, మార్గాలు, సౌకర్యాల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు తెలిపారు. రూ.2 కోట్ల వ్యయంతో పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం, జేబీఎన్ విగ్రహం సమీపంలో ఓపెన్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.1.40 కోట్లతో 7 విలీన గ్రామాలలో శ్మశానవాటిక సీసీ రోడ్, డ్రెయిన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. రూ.కోటి వ్యయంతో కామారెడ్డి పట్టణంలో స్లాటర్ హౌస్ అభివృద్ధి, రూ.20 లక్షలతో కామారెడ్డి భర్కత్‌పుర వద్ద నిర్జన్‌షావలి శ్మశానవాటిక అభివృద్ధి చేపట్టనున్నట్టు తెలిపారు.