అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | కాంగ్రెస్ పాలనలో నిధులు లేక అభివృద్ధి పడకేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఆయన నివాసంలో సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో (BRS) చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) హయాంలో పట్టణ ప్రగతి ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేసి పట్టణాలను సుందరంగా మార్చామన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. దీంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, చెత్త ఎత్తడానికి కూడా నిధులు లేని దుస్థితి నెలకొందన్నారు. నిధుల కొరతతో పట్టణాల్లో పారిశుధ్యం లోపించిందని, దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao | హామీలు అమలు చేయాలి
అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) 420 హామీలు ఇచ్చిందని హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కులు (Shaadi Mubarak Checks) ఇవ్వడం లేదని.. దళిత బంధు, బీసీ బంధు పథకాలను పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.