అక్షరటుడే, వెబ్డెస్క్: Bhatti Vikramarka | ఏబీఎన్ ఛానెల్ యజమాని రాధాకృష్ణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం దిగజారుడు కథనాలు ప్రచారం చేసేంత వీక్ క్యారెక్టర్ తనది కాదన్నారు.
ఎన్టీవీలో ఇటీవల ఓ మంత్రిపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దాని వెనుక భట్టి ఉన్నారని ఏబీఎన్ ఛానెల్లో (ABN channel) వీకెండ్ కథనం ప్రచురితమైంది. అంతేగాకుండా బొగ్గు గనుల కేటాయింపుల విషయంలో సైతం ఆయనపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా ప్రజాభవన్లో భట్టి విక్రమార్క స్పందించారు. తనపై ఆరోపణలు రావడంతో నైని కోల్ బ్లాక్ గనుల టెండర్లు కాన్సెల్ చేసి మళ్లీ కొత్త టెండర్లు వెయ్యండని చెప్పినట్లు తెలిపారు. మిగతా విషయాలన్నీ రాధాకృష్ణ, తాను చూసుకుంటామన్నారు.
Bhatti Vikramarka | ఏది పడితే అది రాయను
రాధాకృష్ణలాగా (Radhakrishna) తాను ఏది పడితే అది రాయను, మాట్లాడనని భట్టి అన్నారు. తనకు బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర ఆస్తులను, ఆత్మను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడమే తన లక్ష్యమన్నారు. ఆస్తులు సృషించుకోవడం కోసమో, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడం కోసమో, అధికారం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఆస్తులను, వనరులను, వ్యవస్థలను సమాజంలోని అన్ని వర్గాలకు పంచడమే తన ఉద్దేశమన్నారు.
Bhatti Vikramarka | పిట్టకథ
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది పిట్టకథ, కట్టుకథలు అని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. సింగరేణి టెండర్లు పిలిచేది సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. రాధాకృష్ణ పిట్టకథ, కట్టు కథలు అల్లి కథనం రాశారన్నారు. రాసిన ఆయనకు ఎవరిపైనో ప్రేమ ఉండొచ్చన్నారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంత వరకు గద్దలను రానివ్వను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎవరు రాయించారో త్వరలో చెబుతానన్నారు.