అక్షరటుడే, దుండిగల్: Datta Peetham | సుబ్రహ్మణ్య షష్ఠిని మార్గశీర్ష శుక్ల పక్షం షష్టి తిథి పురస్కరించుకొని హైదరాబాద్లోని దుండిగల్ దత్తపీఠంలో బుధవారం స్కంద షష్టి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తారకాసురుడిని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించిన సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి పాలు, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు.. అర్చనలు చేశారు.
Datta Peetham | సుబ్రహ్మణ్య నామస్మరణ
లోక కళ్యాణం నిమిత్తం వేదమంత్రాలతో పండితులు, భక్తులు యజ్ఞ ..హోమం కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య నామస్మరణతో దత్తపీఠం మారుమ్రోగింది.
స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కాలసర్ప దోషాలు, రాహు-కేతు దోషాలు తొలగిపోతాయని పండితులు సుధీర్ భక్తులకు వివరించారు.
సంతానం లేని దంపతులు ఈ రోజున ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం పాటిస్తే సంతానం కలుగుతుందన్నారు. పెళ్లి కానివారు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు స్వామివారిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని వివరించారు.
