అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs NZ ODI Series | టీమిండియాతో ఆడితే చెలరేగిపోవడం కొంతమంది విదేశీ బ్యాటర్లకు అలవాటే. ఆ జాబితాలో తాజాగా న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ చేరిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తరహాలోనే భారత్‌పై మిచెల్ బ్యాట్ మాట్లాడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో మరియు చివరి వన్డేలో మరోసారి శతకంతో చెలరేగిన మిచెల్ (Daryl Mitchell), టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారాడు.
ఈ సిరీస్‌లో అతనికి ఇది వరుసగా రెండో సెంచరీ కాగా, మూడోసారి 50కి పైగా స్కోర్ నమోదు చేయడం విశేషం. వడోదరలో జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో శతకం మిస్సైనప్పటికీ, రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 131 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిరీస్ నిర్ణయకరమైన ఇండోర్ వన్డేలో అయితే 137 పరుగులతో భారత బౌలింగ్‌ను పూర్తిగా శాసించాడు.
IND vs NZ ODI Series | వారికి పూనకాలే..
భారత్‌లో టీమిండియా (Team India)తో ఆడిన గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో డారిల్ మిచెల్ నాలుగు శతకాలు బాదడం అతడి ఆధిపత్యాన్ని చాటుతోంది. భారత్‌పై అతడికి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం మరోసారి స్పష్టమైంది. ఇండోర్ మ్యాచ్‌లో మిచెల్ ఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో సింగిల్ తీసి 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న మిచెల్, ఆ తర్వాత భావోద్వేగంగా సంబరాలు చేసుకున్నాడు. ఇది అతడి కెరీర్‌లో మొత్తం తొమ్మిదవ వన్డే శతకం కాగా, అందులో నాలుగు భారత్‌పైనే రావడం విశేషం. ఈ కారణంగానే అభిమానులు సోషల్ మీడియా (Social Media)లో డారిల్ మిచెల్‌ను “మరో ట్రావిస్ హెడ్”గా పోలుస్తున్నారు. టీమిండియాకు అతడు మొండెం పెట్టినట్లుగా వ్యాఖ్యానిస్తూ నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తం 352 పరుగులు చేసిన మిచెల్, భారత్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఓవర్‌సీస్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అతడు 44 ఏళ్ల పాత రికార్డును కూడా చెరిపేశాడు. 1982లో శ్రీలంక బ్యాటర్ రాయ్ డయాస్ భారత్‌లో మూడు వన్డేల సిరీస్‌లో 262 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఆ రికార్డును మిచెల్ అధిగమించాడు. ఈ జాబితాలో డారిల్ మిచెల్ (352) తర్వాత రాయ్ డయాస్ (262), మార్లోన్ సామ్యూల్స్ (254), ఆరోన్ ఫించ్ (250), ఏబీ డివిలియర్స్ (241) ఉన్నారు. వరుసగా ఇలాంటి ప్రదర్శనలతో డారిల్ మిచెల్ పేరు టీమిండియా ప్రత్యర్థుల్లో ప్రత్యేకంగా మారుతోంది.
