అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyclone Ditwah | బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ క్రమంగా బలహీన పడుతోంది. దీని ప్రభావంతో శ్రీలంక (Sri Lanka) అతలాకుతలం అయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. తమిళనాడు (Tamil Nadu) వైపు కదులుతున్న తుపాన్ క్రమంగా బలహీన పడుతోందని చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దిత్వా తుపాన్ తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు కదులుతోంది. ఇది తీరాన్ని తాకే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే తుపాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. తిరువళ్లూరు, రాణిపేటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు హెచ్చరించారు. తుపాన్ ప్రభావంతో చెన్నై, రాణిపేట, తిరువళ్లూరుకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతంలో 90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం వెంబడి అలల ఉధృతి కొనసాగుతోంది.
Cyclone Ditwah | ఆంధ్రప్రదేశ్‌పై..
దక్షిణ కోస్తాకు దిత్వా తుపాన్ ముప్పు పొంచి ఉంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కి.మీ దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉత్తరం వైపు తుపాన్ కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా నేడు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Cyclone Ditwah | తెలంగాణలో..
తెలంగాణ (Telangana)పై తుపాన్ ఎఫెక్ట్ స్వల్పంగా ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
