అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Crime | సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలను నమ్మించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ వైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల చేతిలో బలవుతున్నారు.
సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో ఓ ఐటీ ఉద్యోగి నుంచి సైబర్ నేరస్తులు ఏకంగా రూ.54 లక్షలు కాజేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. పటాన్చెరులో నివాసం ఉంటున్న ఆయనకు సెప్టెంబర్ 5న టెలిగ్రామ్‌లో మెసేజ్ వచ్చింది. బ్రాండెడ్ కంపెనీలకు రేటింగ్ ఇస్తే కమీషన్ ఇస్తామని అందులో ఉంది. దీంతో ఆయన నమ్మి వారిని సంప్రదించారు. దీనికోసం మొదట కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలని నిందితులు నమ్మించారు.
Cyber Crime | విడతల వారీగా..
సైబర్ దొంగలు చెప్పింది నమ్మిన ఆ ఐటీ ఉద్యోగి మొదట రూ.5 వేలు వారు చెప్పిన ఖాతాకు పంపించాడు. దీంతో నిందితులు రూ.7 వేల లాభం వచ్చిందని చెప్పారు. మొత్తం రూ.12 వేలు అతడి అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఇది నిజమని సదరు వ్యక్తి నమ్మాడు. విడతల వారీగా రూ.54 లక్షలు అందులో ఇన్వెస్ట్ చేశాడు. అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Cyber Crime | అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్‌లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్ చేసి తాము పోలీసులం, సీబీఐ అధికారులమని(CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. ట్రేడింగ్, కమీషన్లు, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, పార్ట్‌టైం జాబ్‌ల పేరిట సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని సూచించారు.