అక్షరటుడే, హైదరాబాద్: cyber crime | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారి ఆగడాలకు అడ్డు ఉండటం లేదు.
ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా.. అమాయకులు మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల చెరలో పడిన వారిలో సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం ఆందోళనకరం. తాజాగా హైదరాబాద్‌లో మరో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది.
ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చెరలో చిక్కి భారీ మొత్తంలో డబ్బు పోగుట్టుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్ల పేరుతో సుమారు రూ.14 కోట్లను వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు.
cyber crime | ఫేక్ ట్రేడింగ్ వెబ్‌సైట్ లింక్
ఈ సైబర్ నేరగాళ్లు మొదట బాధిత వైద్యుడికి సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం అయ్యారు. మోనిక మాధవన్ అనే మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో వైద్యుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు.
అనంతరం ఫేక్ ట్రేడింగ్ వెబ్‌సైట్ లింక్ సెండ్ చేశారు. భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు వైద్యుడిని నమ్మబలికారు. కానీ, నగదు విత్ డ్రా చేయాలంటే పన్ను (ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
వైద్యుడు పట్టించుకోకపోవడంతో పన్ను కట్టాల్సిందేనని ఒత్తడి తీసుకొచ్చారు. దీంతో సైబర్ నేరగాళ్లు అడిగిన మొత్తాన్ని చెల్లించాడు బాధిత వైద్యుడు.
కాగా, వారు అడిగిన మొత్తాన్ని చెల్లించినా కూడా అవతలివారు డబ్బులు పంపించకపోవడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యుడు రూ. 14 కోట్లు పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.