అక్షరటుడే, వెబ్డెస్క్: America | అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు వ్యవహరించిన తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిన్నసోటా రాష్ట్రంలో ఐదేళ్ల బాలుడిని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Immigration and Customs Enforcement) ఏజెంట్లు అదుపులోకి తీసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ సంఘటనపై రాజకీయంగా పెద్ద చర్చ జరగడమే కాకుండా, మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన కొలంబియా హైట్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐదేళ్ల లియామ్ రామోస్, అతడి తండ్రి ఏడ్రియన్ ఏరియాస్‌ను వారి ఇంటి వద్ద ఐస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు.
America | తీవ్ర విమర్శలు..
అయితే, ఈ ఆపరేషన్‌లో బాలుడిని ‘ఎర’గా వాడుకున్నారని పాఠశాల అధికారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాలుడితోనే ఇంటి తలుపు తట్టించి, లోపల ఎవరైనా ఉన్నారా అని నిర్ధారించుకున్నారని స్కూల్ సూపరింటెండెంట్ జెనా స్టెన్‌విక్ ఆరోపించారు. ఇది చిన్నారి భద్రతను ప్రమాదంలోకి నెట్టిన చర్యగా ఆమె పేర్కొన్నారు.ఈ ఘటనపై అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం,“లియామ్ రామోస్ ఇంకా పసివాడు. ఇలాంటి చిన్నారిని ఐస్ ఏజెంట్లు ఎరగా వాడటం దారుణం. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది” అని ఆమె వ్యాఖ్యానించారు. బాలల హక్కులు, మానవీయ విలువలు ఎక్కడున్నాయని ఆమె ప్రశ్నించారు.
అయితే, ఈ ఆపరేషన్‌ను ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (Vice President JD Vance) సమర్థించారు. చట్టాన్ని అమలు చేసే అధికారులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా వ్యవహరించిన అధికారులను తప్పుపట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆరోపణలను ఖండించింది. బాలుడిని ఉద్దేశపూర్వకంగా ఎరగా వాడలేదని స్పష్టం చేసింది. బాలుడి తండ్రి ఏడ్రియన్ ఏరియాస్ తప్పించుకునే ప్రయత్నం చేసిన సమయంలో, చిన్నారి భద్రత కోసమే అధికారులు అతడితో కలిసి ఉన్నారని డీహెచ్ఎస్ వెల్లడించింది. పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకే అలా చేయాల్సి వచ్చిందని వాదించింది.ప్రస్తుతం లియామ్ రామోస్, అతడి తండ్రిని టెక్సాస్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆశ్రయం కోసం వారు దాఖలు చేసిన దరఖాస్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ, వారిని అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని కుటుంబ న్యాయవాది తెలిపారు.