అక్షరటుడే, వెబ్డెస్క్ : Ahmedabad | జాకెట్ కుట్టలేదని ఓ దర్జీకి కోర్టు జరిమానా (Court Fine) విధించింది. వివాహ సమయానికి బ్లౌజ్ కుట్టించక పోవడంతో రూ.7 వేల ఫైన్ విధించింది. అసలేం జరిగిందంటే.. అహ్మదాబాద్ (Ahmedabad) కు చెందిన ఓ మహిళ డిసెంబర్ 24, 2024న బంధువుల వివాహానికి వెళ్లాల్సి ఉంది.
దీంతో ఆమె బ్లౌజ్ కుట్టివ్వాలని ఓ దర్జీ వద్దకు వెళ్లింది. నిర్దేశిత సమయంలోగా తనకు జాకెట్ కుట్టివ్వాలని కోరగా, అతడు అంగీకరించాడు. అందుకు గాను ఆమె దర్జీకి రూ.4395 కూడా చెల్లించింది. అయితే, వివాహ సమయం దగ్గర పడుతుండడంతో సదరు మహిళ టేలర్ వద్దకు వెళ్లింది. డిసెంబర్ 14న బ్లౌజ్ తీసుకోవడానికి వెళ్ళిన ఆమెకు అనుకోని రీతిలో షాక్ తగిలింది. తాను చెప్పిన డిజైన్ ప్రకారం జాకెట్ కుట్టలేదని ఆమె కనుగొంది. తప్పును సరిదిద్దుతానని దర్జీ ఆమెకు హామీ ఇచ్చాడు. కానీ ఆయన తిరిగి కుట్టించి ఇచ్చేందుకు భారీగా సమయం తీసుకున్నాడు. ఆలోగా వివాహం జరిగి పోయింది. అయినప్పటికీ దర్జీ ఆమెకు బ్లౌజ్ కుట్టివ్వలేదు.
Ahmedabad | కోర్టుకెక్కిన బాధితురాలు..
బ్లౌజ్ ఆలస్యం కావడానికి కారణమైన దర్జీపై బాధితురాలు న్యాయ పోరాటానికి దిగింది. దర్జీకి లీగల్ నోటీసు (Legal Notice) పంపింది. అహ్మదాబాద్ లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (అదనపు)కి ఫిర్యాదు చేసింది. దర్జీ కమిషన్ ముందు హాజరు కాలేదు. బ్లౌజ్ డెలివరీ (Blouse Delivery) చేయడంలో విఫలమైనందుకు “సర్వీస్ లో లోపం” కింద అతన్ని దోషిగా నిర్ధారించిన ప్యానెల్, బాధితురాలు “మానసిక వేధింపులకు” గురయ్యారిని పేర్కొంది. దీంతో 7 శాతం వార్షిక వడ్డీతో కలిపి రూ. 4,395 తిరిగి చెల్లించాలని, అలాగే, మానసిక క్షోభకు గురైనందుకు, వ్యాజ్యం ఖర్చులకు అదనంగా పరిహారం చెల్లించాలని కోర్టు దర్జీని ఆదేశించింది. ఈ లెక్కన దర్జీ దాదాపు రూ. 7,000 మహిళకు చెల్లించాల్సి వచ్చింది.
Ahmedabad | కేరళలోనూ ఇలాంటి కేసు
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కేరళలోని కొచ్చిలో ఇలాంటి కేసు నమోదైంది. ఇచ్చిన కొలతల ప్రకారం చొక్కా కుట్టడంలో విఫలమైనందుకు గాను ఎర్నాకుళం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఒక దర్జీ సంస్థకు రూ. 15 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారుడు ఆగస్టు 2023లో కస్టమ్-మేడ్ చొక్కాను ఆర్డర్ చేశాడు, కానీ తరువాత కుట్టిన చొక్కా సరిగ్గా సరిపోలేదని కోర్టుకు చెప్పాడు. కస్టమర్ తాను అనుభవించిన మానసిక క్షోభ, ఆర్థిక నష్టానికి ఉపశమనం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ దర్జీకి రూ.15 వేల ఫైన్ వేసింది.

