అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు సైబర్ భద్రతపై (cyber security) అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ (Fraud ka Full Stop) కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు 6 వారాల అవగాహన ప్రణాళిక కింద ప్రతి వారం ప్రత్యేక సైబర్ భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించబడుతుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వ్యక్తిగత సమాచారం రక్షణ, ఆన్‌లైన్ లింకులు, అనుమానాస్పద ఫోన్‌కాల్స్, డబ్బు బదిలీపై జాగ్రత్తలు, సైబర్ స్మార్ట్‌గా ఉండడం, అవగాహనను ఇతరులకు పంచడం లాంటి ప్రధాన అంశాలు ఉంటాయన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ’నేను నా వ్యక్తిగత సమాచారాన్ని అజాగ్రత్తగా ఇతరులతో పంచుకోనని, ఆన్లైన్లో తెలియని లింక్‌లు నొక్కనని’ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పోస్టర్లను ఎస్పీ రాజేష్ చంద్ర ఆవిష్కరించారు. ప్రజలు, విద్యార్థులు, యువతను సైబర్ నేరాలపై అప్రమత్తం చేయడంలో అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
