అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police constable | మామూలు వ్యక్తులు ఒక ట్రాక్టర్ ఇసుకను అక్రమంగా తరలిస్తే హడావుడి చేసి కేసులు నమోదు చేసే పోలీసులు.. సొంత శాఖలోని సిబ్బంది ఒకరు ఇసుకాసురుడిగా అవతారం ఎత్తినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతకొన్నేళ్లుగా ఇసుక దందాను నడిపిస్తున్న ఓ కానిస్టేబుల్.. పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడ్డాడు. ఇప్పటికీ తన సోదరుల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తూ పెద్దమొత్తంలో డంపులు నిల్వ చేయడమే కాకుండా ఇసుక ప్లాంట్లను సైతం నెలకొల్పాడు. కాగా.. సదరు కానిస్టేబుల్‌కు పోలీస్ శాఖలోనే పలువురు అండదండలు అందిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
మాక్లూర్ మండలానికి చెందిన కానిస్టేబుల్ ఇసుక దందా అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గత కొన్నేళ్లుగా ఖాకీ ముసుగులో సదరు కానిస్టేబుల్ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. గతంలో మహిళా పోలీస్ స్టేషన్, రూరల్ ఠాణాలలో పనిచేసిన సమయంలో ఇసుక మైనింగ్‌కు చేశాడు. ఆ తర్వాత ఫిర్యాదులు వెళ్లడంతో రైల్వే విభాగంలోకి డిప్యూటేషన్‌పై వెళ్లాడు. అయినప్పటికీ ఇసుక దందాను మాత్రం ఆపలేదు. స్థానిక పోలీసులను మచ్చిక చేసుకుని పగలు, రాత్రిళ్లు ఇసుక దందాను నడిపిస్తున్నట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది.
Police constable | ఏళ్లుగా నడుస్తున్నా చర్యలేవి..
సదరు కానిస్టేబుల్ మాక్లూర్ కేంద్రంగా ఏళ్లుగా దందా నడిపిస్తున్నాడనేది జగమెరిగిన సత్యం. ఇసుక తరలించే సమయంలో ప్రత్యక్షంగా లేకపోయినా.. డంపులు, ఇసుక ప్లాంట్లను అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఇది సరిపోదనట్లు.. తన బంధువులను బినామీలుగా పెట్టుకుని ఓ రైస్‌మిల్‌ను నిర్వహిస్తున్నాడు. ఇవన్నీ కమిషనరేట్ అధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్‌లో ఉండే సిబ్బంది ఒకరు సమీప బంధువు కావడంతో అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు సమాచారం. అధికారుల కదలికలు, తీసుకునే చర్యలపై ఎప్పటికప్పడు సదరు కానిస్టేబుల్‌కు ఉప్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా ఎస్బీలో పనిచేస్తున్న సదరు సిబ్బంది సైతం ఇసుక దందాలో పాల్గొనడంలో నిశిరాత్రి వేళలో టిప్పర్లలో అక్రమ రవాణా చేస్తుండడం గమనార్హం.
Police constable | సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా..
పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే వారు ఏ విధమైన వ్యాపారాలు నిర్వహించేందుకు వీలు లేదు. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలతో ముడిపడి ఉన్న అంశాల్లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాలుపంచుకోకూడదు. కానీ కమిషనరేట్‌కు చెందిన సదరు కానిస్టేబుల్ రైల్వేశాఖలో డిప్యూటేషన్‌పై కొనసాగుతూ ఒకవైపు ఇల్లీగల్ మైనింగ్, మరోవైపు రైస్‌మిల్ దందా, ఇంకోవైపు ఇసుక ప్లాంట్లు నిర్వహిస్తుండడం గమనార్హం. ఇవన్నీ కొందరు అధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం కొసమెరుపు. ప్రత్యేకించి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న సీపీ సాయిచైతన్య సొంత శాఖలోని సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
