అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Talasani Srinivas Yadav | రాష్ట్ర ప్రభుత్వం (State Government) సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. మంగళవారం ఆయన పలు సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు.
జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనలో సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని పోలీస్ స్టేషన్లు, డివిజన్లను మల్కాజిగిరి జోన్ కిందకు చేర్చడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ నగరంలో వార్డుల విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే పోలీస్ కమిషనరేట్లలో (Police Commissionerates) సైతం మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ను విభజిస్తే ఊరుకోమన్నారు. అయితే దానిపై సోమవారం సీఎం స్పందించారు. సికింద్రాబాద్‌ను తాము ఏం మార్చడం లేదని, రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate) పేరు మాత్రమే మార్చామన్నారు. దీనిపై తాజాగా తలసాని స్పందించారు.
Talasani Srinivas Yadav | 17న శాంతిర్యాలీ
సికింద్రాబాద్ ముక్కలు కాకుండా అందరం కలిసి పోరాటం చేయాలని ఆయన సూచించారు. వ్యాపారులు, కుల సంఘాల నాయకులు కలిసి రావాలని కోరారు. ఈ నెల 17 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
కేసీఆర్ (KCR) హయాంలో జిల్లాలు విభజించి, పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేశారన్నారు. కానీ ప్రస్తుతం ఏ పోలీస్ స్టేషన్ దేని పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్‌పల్లి సర్కిల్‌లోకి చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించాలన్నారు.