అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Talasani Srinivas Yadav | మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వాన్ని దెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
బచావో సికింద్రాబాద్ పోస్టర్లను శుక్రవారం తలసాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే చర్యలను అడ్డుకుంటామన్నారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్ (Railway Station) నుంచి MG రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు తరలి రావాలని కోరారు.
Talasani Srinivas Yadav | 220 ఏళ్ల చరిత్ర
సికింద్రాబాద్ ప్రాంతానికి 220 ఏళ్ల చరిత్ర ఉందని తలసాని అనారు. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. లష్కర్ బోనాలకు (Lashkar Bonam) పెద్ద చరిత్ర ఉందన్నారు. అలాంటి సికింద్రాబాద్‌ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇదే మంచి సమయం అన్నారు. సికింద్రాబాద్‌ను టచ్ చేయలేదని సీఎం చెబుతున్నారని, మరి నార్త్ జోన్ పరిధిలోని ప్రాంతాలను మల్కాజ్గిరి కమిషనరేట్ (Malkajgiri Commissionerate)లో ఎందుకు కలిపారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలోని కమిషనరేట్లను పునర్విభజించిన విషయం తెలిసిందే. గతంలో మూడు కమిషనరేట్లు ఉండగా.. వాటిని నాలుగుకు పెంచింది. గతంలో ఉన్న రాచకొండ కమిషనరేట్‌ను తొలగించింది. దాని స్థానంలో మల్కాజ్గిరి కమిషనరేట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో కొనసాగిన పలు ప్రాంతాలను మల్కాజ్గిరి పరిధిలోకి మార్చింది. దీనిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతున్నారు.