అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో (Congress party office) శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడత సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ శనివారంతో ముగిసిందని, కొన్ని చోట్ల సర్వర్ సమస్యలతో ఇంకా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 80-90 శాతం గెలిచే అవకాశం ఉందన్నారు. కొన్ని పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన అభివృద్దే ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా కనిపించబోతుందని తెలిపారు. 13 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు (new ration cards) ఇవ్వలేదని తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చామన్నారు. రూ. 6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చామని, ఎన్నికల కోడ్ (election code) ముగిసిన తర్వాత మళ్లీ రైతు భరోసా వేస్తామన్నారు. నియజకవర్గంలో 3,600 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయితే మూడు వేల ఇళ్ల పనులు మొదలయ్యాయని తెలిపారు. మరో 600 కొన్ని సమస్యలతో మొదలు కాలేదని తెలిపారు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది లేదని, అర్బన్‌లో స్థలం లేక ఇబ్బంది అవుతోందన్నారు. మరో మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ మద్దతు దారులకు ఓటు వేసి గెలిపించాలని షబ్బీర్ అలీ కోరారు.
నామినేషన్లు మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు పంచాయతీల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారన్నారు. మాచారెడ్డి మండలంలోని (Machareddy Mandal) వెనుకతండా సర్పంచ్‌గా కేలోత్ పద్మ, ఎల్లంపేట గ్రామంలో మారుపాక అంజమ్మ, అంకిరెడ్డి పల్లి తండాలో బాణోత్ శ్రీరామ్, బోడగుట్ట తండాలో మాలోత్ సంతోష్ లు సింగిల్ నామినేషన్లు వేశారని, అధికారికంగా ఏకగ్రీవ ప్రకటన రావాల్సి ఉందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ నిధులతో పాటు ఎంపీ నిధుల ద్వారా రూ. 5 లక్షలు, తన ఎస్డీఎఫ్ నిధుల ద్వారా మరో ఐదు లక్షలు మొత్తం 20 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తామన్నారు.
దోమకొండకు (Domakonda) 50 పడకల ఆస్పత్రి తీసుకువస్తే స్థలం చూపించే వారు దిక్కులేరన్నారు. ఆస్పత్రి మంజూరు తెచ్చి సంవత్సరం అవుతుందన్నారు. కమరే 100 పడకల ఆస్పత్రి మెడికల్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్లడానికి ఇబ్బంది అయితే ఈ మధ్య బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. చాలా చోట్ల మెడికల్ కళాశాలలు ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయని, కామారెడ్డిలో పూర్తయిందన్నారు. మరో రూ.26 కోట్లు నిధులు మంజూరయితే వంద శాతం మెడికల్ కళాశాల పూర్తవుతుందని తెలిపారు. దీనికోసం హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రెటరీతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
రూ. 9 కోట్ల వ్యయంతో ఇందిరాగాంధీ స్టేడియం (Indira Gandhi Stadium) పక్కన ఇండోర్ స్టేడియం నిర్మించడం జరుగుతుందని తెలిపారు. స్టేడియంలో డే అండ్ నైట్ ఆడుకునేలా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. పట్టణంలో రూ. 9.5 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. అమృత్ స్కీం (Amruth scheme) పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, పనుల వేగం కోసం మెగా కంపెనీతో మాట్లాడడం జరిగిందన్నారు. కామారెడ్డికి 6 ఎంఎల్డీ తాగునీరు కాకుండా అదనంగా 10 ఎంఎల్డీ నీటి కోసం పైప్ లైన్ పనులు సాగుతున్నాయన్నారు. జనవరి వరకు పనులు పూర్తవుతాయన్నారు. జీజీహెచ్‌లో 30 బెడ్ల పనుల కోసం షెడ్ ఇతర పనులకు రూ. 28 లక్షలు కావాలన్నారని, ఎంపీ నిధులు, ఎస్డీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేసి 2, 3 నెలల్లో పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు.
Shabbir Ali | కామారెడ్డి అభివృద్ధికి కవిత కలిసి రావాలి
కామారెడ్డిలో అభివృద్ధికి నిధులు తేవడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ స్పందించారు. కవితకు కూడా కామారెడ్డి అభివృద్ధిపై బాధ్యత ఉందన్నారు. ఆమె ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నారని, కామారెడ్డి అభివృద్ధికి తమతో కలిసి రావాలని షబ్బీర్ అలీ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా తనతో కలిసి వస్తున్నారన్నారు. కామారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూడా రావాలని సూచించారు.
కామారెడ్డి అభివృద్ధికి ఈ నిధులు అందుబాటులో ఉంటే ఆ నిధులు తెస్తానని తెలిపారు. కాళేశ్వరం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను డిజైన్ చేసిన ప్రాజెక్టు పనులకు పదేళ్లలో రూపాయి ఇవ్వలేదన్నారు. నిజామాబాద్ రూరల్‌లో 0.9 టీఎంసీ చేయడం వల్ల అక్కడ 12 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఫారెస్ట్ ఏరియా పోతుందని తెలిపారు. దాంతో పాత డిజైన్‌తోనే పనులు చేయడానికి నిర్ణయించడం జరిగిందని, ఇటీవల 28 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
పదేళ్లుగా కవిత ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నారని, ఆకాశంపై ఉమ్మితే మన మీదే పడుతుందని గుర్తుంచుకోవాలని చురక అంటించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, యూత్ నాయకుడు ఇలియాజ్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
