అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో కొత్తగా నిర్మించినవేమీ లేకపోవడంతో కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులకు సీఎం రిబ్బన్ కట్ చేస్తున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం చనాకా-కొరాట ఎత్తిపోతల పథకం (Chanaka-Korata lift irrigation scheme), సదర్మట్ బ్యారేజీలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై ‘ఎక్స్’ వేదికంగా హరీశ్‌రావు స్పందించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు, సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీ మేడ్‌గా తయారై ఉన్నాయన్నారు. తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక్క ఇటుక వేసింది లేదని.. అయినా చనాకా-కొరాట, సదర్మట్ బ్యారేజీలను (Sadarmat barrages) తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు.
Harish Rao | ఒప్పందం చేసుకొని..
కేసీఆర్ (KCR) మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని, రూ.1200 కోట్లతో చనాకా-కొరాట బ్యారేజీ, పంప్ హౌస్‌లు, ప్రధాన కాలువ, సబ్ స్టేషన్లతో సహా పనులు పూర్తి చేయించారని మాజీ మంత్రి పేర్కొన్నారు. 2023 సెప్టెంబర్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా వెట్ రన్ కూడా పూర్తయిందన్నారు. ప్రాజెక్టు కాల్వల పనులకు అవసరమైన 3,200 ఎకరాల్లో 1600 ఎకరాలను కేసీఆర్ సేకరిస్తే.. ఈ రెండేళ్లలో ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేని, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని మళ్లీ రీ-రన్ (వెట్ రన్) డ్రామాలు ఆడుతున్నావని ప్రశ్నించారు.
Harish Rao | క్రెడిట్ కొట్టేయడంపై శ్రద్ధ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. భూసేకరణ మీద పెట్టి ఉంటే ఈ పాటికి ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు దక్కేవని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. 1.5 TMCల సామర్థ్యంతో కేసీఆర్ రూ. 500 కోట్లతో సదర్మట్ బ్యారేజీని సిద్ధం చేస్తే.. రెండేళ్లుగా చుక్క నీరు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. రెండేళ్ల క్రితమే 18వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా.. ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేస్తూ.. అంతా మీ ఘనతే అని డబ్బా కొట్టుకోవడం మీ దగుల్భాజీతనానికి పరాకాష్ట అని విమర్శించారు.
Harish Rao | ముక్కు నేలకు రాయాలి
రెండేళ్ల కాలం వృథా చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు పంచడం.. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప సొంతంగా చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుకు సున్నాలు వేసి నాదే అని చాటింపు వేసుకోవడం వారి అల్పబుద్దికి నిదర్శనమని విమర్శించారు. ప్రాజెక్టులు కట్టడం మా వంతు, పేర్లు పెట్టుకోవడం మీ వంతు పరిపాటిగా మారిందన్నారు.
Harish Rao | ఆయన పేరు పెట్టడం ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే..
లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పేరు చెప్పుకొని రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి.. ప్రజల్ని మోసం చేసిన సి. రామచంద్రారెడ్డి పేరు ప్రాజెక్టుకు పెట్టడం ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను అవమానించడమేనని హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజల కలలు సాకారం చేసింది బీఆర్ఎస్ అయితే, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వీసమెత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. ఆదిలాబాద్ వెనుకబాటు తనానికి, పాలమూరు వలసలకు కారణం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతామని చెప్పి రెండేళ్లు గడిచినా.. ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేక పోయారన్నారు. గ్రావిటి కాలువను వదిలి ఎత్తిపోతలకు వెళ్లామని మమ్మల్ని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు తమ్మడిహట్టి నుంచి గ్రావిటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి చూపాలని సవాల్ విసిరారు. లేదంటే అధికారం కోసం ప్రజలకు నోటికొచ్చిన అబద్దం చెప్పినందుకు క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేశారు.