అక్షరటుడే, వెబ్‌డెస్క్: Muthyala Sunil Reddy | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సునీల్‌రెడ్డికి (Sunil Reddy) ఊరట లభించింది. ఆయనకు నాంపల్లి కోర్టు (Nampally Court) బెయిల్ మంజూరు చేసింది.
జీఎస్టీ ఎగవేత కేసులో సునీల్‌రెడ్డిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (Directorate General of GST Intelligence) (డీజీజీఐ) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఆయన కొనసాగుతున్నారు. రాష్టవ్యాప్తంగా పన్ను ఎగవేతకు పాల్పడిన వారిని గుర్తించడానికి డీజీజీఐ అధికారులు (DGGI officials) ఇటీవల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సునీల్‌రెడ్డి రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని గుర్తించారు. మూడు నెలల గడువు ముగిసినా జీఎస్టీ చెల్లించకపోవడంతో ఆయన జీఎస్టీ చట్టం 2017 ప్రకారం అరెస్ట్ చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీగా ఉన్న ఆయన రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేశారని, దానిని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు.
Muthyala Sunil Reddy | రూ.5 లక్షల పూచికత్తుపై..
అరెస్ట్‌పై సునీల్‌రెడ్డి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టుకు ఆయన ఊరటనిచ్చింది. జీఎస్టీ ఎగవేత కేసులో బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. మరోవైపు జీఎస్టీ ఎగవేత కేసులో ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్ ఎన్ సైతం అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది.