అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | వందేళ్లకు పైబడిన చరిత్ర.. దశాబ్దాలకు పైగా దేశాన్ని ఏలిన ఘనత.. భారతదేశ రాజకీయ యవనికపై కాంగ్రెస్ పార్టీది చెరిగిపోని ముద్ర. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో పురుడు పోసుకున్న హస్తం పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. బానిస సంకెళ్ల నుంచి దేశానికి ముక్తి కల్పించి, సంస్కరణలతో అభివృద్ధి బాట పట్టించిందన్న పేరు సొంతం చేసుకుంది. వందేళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) కొన్నేళ్లుగా ప్రాభవం కోల్పోతోంది. దేశవ్యాప్తంగా పటిష్టమైన కేడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం కారణంగా ప్రజలకు దూరమవుతోంది. అందులోనూ రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ప్రధానంగా తెర పైకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పరాభవమే ఎదురవుతోంది. ఆయన ఒంటెద్దు పోకడలు, అనాలోచిత వ్యాఖ్యలు పార్టీ ప్రభను మసక బార్చుతున్నాయి. బలమైన బీజేపీని ఎదుర్కోవడానికి సరైన వ్యూహాలు పన్నడంలో రాహుల్ తరచూ విఫలమవుతున్నారు. దీంతో వరుస వైఫల్యాలు కాంగ్రెస్‌కు ఇబ్బంది కరంగా పరిణమించాయి.
Rahul Gandhi | గాంధీల వారసత్వం..
కాంగ్రెస్ పార్టీ అంటేనే వారసత్వ పార్టీగా ముద్ర వేసుకుంది. జవహార్ లాల్ నెహ్రూ తర్వాత మొదలైన ఈ ఆనవాయితీ ఇంకా కొనసాగుతోంది. ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ఇప్పుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ.. ఇలా గాంధీ వారసత్వమే పార్టీని ముందుకు నడిపిస్తోంది. మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, కీలక నిర్ణయాలన్నీ గాంధీ కుటుంబానివే. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కొనసాగినప్పుడు ఒక్క పీవీ నర్సింహారావు మినహా ప్రధానిగా ఎవరు ఉన్నా ఆ కుటుంబానిదే పెత్తనం కొనసాగింది. పార్టీ కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం పని చేశారన్న అక్కసుతోనే ఆయన చనిపోయిన సమయంలో అవమానించిందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఆయన తర్వాత మన్మోహన్‌సింగ్ ప్రధాని ఉన్న కాలంలో యూపీఏ చైర్ పర్సన్‌గా సోనియాగాంధీ(UPA Chairperson Sonia Gandhi), ఆ తర్వాత రాహుల్‌గాంధీ సూడో ప్రధానిగా వ్యవహరించారన్న అపప్రదను మూట గట్టుకున్నారు.
Rahul Gandhi | రాహుల్ ఒంటెద్దు పోకడలు..
వయస్సు భారం, అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ తప్పుకోవడంతో రాహుల్‌గాంధీ పార్టీ బాధ్యతలను స్వీకరించారు. అప్పటికే విస్తరణ దిశలో ఉన్న బీజేపీ(BJP)ని రాహుల్ దీటుగా ఎదుర్కోంటాని కేడర్ భావించింది. కానీ, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ఘోర ఓటములను మూట గట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలతో(Lok Sabha Elections) పాటు పలు రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీ పరాజయం పాలైంది. కోటరీనే నమ్ముకున్న రాహుల్‌గాంధీ మిగతా వారిని విస్మరించారు. ఆయన ఒంటెద్దు పోకడలతో గులాం నబీ ఆజాద్ లాంటి ఎంతో మంది కీలక నాయకులు పార్టీకి దూరమయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న రాహుల్‌గాంధీ ఇప్పటికీ పరిపూర్ణత సాధించలేక పోయారన్న అపవాదు మూటగట్టుకున్నారు.
Rahul Gandhi | అనాలోచిత వ్యాఖ్యలు..
గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ అనాలోచిత వ్యాఖ్యలతో తనతో పాటు పార్టీ పరువును బజారుకీడ్చుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. బలమైన బీజేపీని ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రతిష్టను మసక బార్చుతున్నాయి. సైన్యాన్ని అవమానించేలా మాట్లాడడం నుంచి ఎన్నికల సంఘం(Election Commission)పై ఆరోపణల వరకు ఆయన చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. భారత్ జోడోయాత్ర సందర్భంగా సైన్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi)పై తప్పుడు కూతలు కూసి చిక్కుల్లో పడాల్సి వచ్చింది. వీడీ సావర్కార్ పైనా అలాగే పిచ్చి వ్యాఖ్యలు చేసి కోర్టు బోను ఎక్కాల్సి వచ్చింది. బీజేపీపై, ఆర్ఎస్ఎస్‌పై ఆరోపణలు చేసే క్రమంలో ఆయన దేశ సార్వభౌమత్వంపై, రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.
Rahul Gandhi | బీజేపీకి ఆయుధంగా మారి..
కాంగ్రెస్ వైఫల్యాలకు తోడు పటిష్ట ప్రణాళికలతో బీజేపీ దేశంలో బలంగా వేళ్లూనుకుంది. అందులో రాహుల్‌గాంధీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాషాయ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. స్వాతంత్య్ర భారత చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెసేతర పార్టీ వరుసగా మూడు సార్లు అధికారం చేపట్టింది. పైగా ప్రాంతీయ పార్టీలు బలంగా మారి, సంకీర్ణ ప్రభుత్వాల హవా కొనసాగుతున్న కాలంలో రెండుసార్లు సంపూర్ణ మెజార్టీ సాధించిన ఘతనను బీజేపీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నాయకత్వ లోపం, రాహుల్‌గాంధీ వైఫల్యం కాషాయ పార్టీకి ఆయుధంగా మారింది. కాంగ్రెస్ నేత చేస్తున్న అనాలోచిత వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుండడాన్ని అవకాశంగా మార్చుకుని ఘన విజయాలు సాధిస్తోంది. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని బీజేపీ దాదాపు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చింది. దేశంలో కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే హస్తం పార్టీ అధికారంలో ఉండడమే అందుకు నిదర్శనం. వరుస ఓటములు, దూరమవుతున్న నాయకులు, కోర్టుల చీవాట్లు, జనం ఛీత్కరింపులు.. ఇలా ఎన్ని పరాభవాలు మిగులుతున్నా పార్టీ ఆలోచనావిధానం కానీ, రాహుల్‌గాంధీ కానీ మారకపోవడం కాంగ్రెస్ వైచిత్రి.