HomeజాతీయంPM Modi | సాగురంగాన్ని విస్మ‌రించిన కాంగ్రెస్‌.. ప్ర‌తిప‌క్ష పార్టీపై ప్ర‌ధాని మ‌రోసారి నిప్పులు

PM Modi | సాగురంగాన్ని విస్మ‌రించిన కాంగ్రెస్‌.. ప్ర‌తిప‌క్ష పార్టీపై ప్ర‌ధాని మ‌రోసారి నిప్పులు

PM Modi | ప‌దేళ్ల పాల‌న‌లో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌సాయ రంగాన్ని విస్మరించింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విమ‌ర్శించారు. ఎన్డీయే హ‌యాంలో సాగురంగానికి పెద్ద‌పీట వేశామ‌ని, రైతుల‌ను బలోపేతం చేశామ‌న్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ప‌దేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) వ్య‌వ‌సాయ రంగాన్ని నిర్వీర్యం చేసింద‌ని మండిప‌డ్డారు.

శ‌నివారం న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధానమంత్రి(PM Modi) ప్ర‌సంగించారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరించిందని అన్నారు. అయితే, భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగురంగానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చింద‌న్నారు. గత 11 సంవత్సరాలలో రైతులను బలోపేతం చేయడానికి, స్వావలంబన సాధించ‌డానికి అనేక చర్యలు చేప‌ట్టామ‌న్నారు.

PM Modi | జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌తో రైతుకు మేలు..

గత నెలలో అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణల(GST Reforms) వ‌ల్ల రైతుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం కలుగుతంద‌ని ప్ర‌ధాని తెలిపారు. జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు రైతులకు, దేశంలోని గ్రామీణ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే తమ‌ ప్రభుత్వం లక్ష్యమ‌ని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం(UPA Government) ప‌దేళ్ల‌లో ఎరువులపై కేవ‌లం రూ. 5 లక్షల కోట్లు సబ్సిడీ ఇచ్చిందని ఆయన అన్నారు. కానీ, తాము ఏడాదిలోనే అంత‌కంటే ఎక్కువ ఇస్తున్నామి చెప్పారు. “కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయానికి ప్రభుత్వ మద్దతు లభించడం చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు, గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని విస్మరించాయి. గ‌త యూపీఏ ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల ఎటువంటి దార్శనికత లేదా ఆలోచన లేదు” అని ప్ర‌ధాని కాంగ్రెస్‌ను విమర్శించారు. “వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ విభాగాలు తమదైన రీతిలో పనిచేశాయి, ఇది భారతదేశ వ్యవసాయ వ్యవస్థను నిరంతరం బలహీనపరిచిందని” తెలిపారు.

PM Modi | రైతు బ‌లోపేతానికి చ‌ర్య‌లు..

ఎన్డీయే హ‌యాంలో రైతుల బ‌లోపేతానికి అనేక చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని మోదీ వెల్ల‌డించారు. విత్త‌నాలు, ఎరువులు, మార్కెటింగ్ తో పాటు మౌలిక వ‌స‌తులు పెంపొందించామ‌న్నారు. “వ్యవసాయం పట్ల మునుపటి ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని మేము మార్చాము. విత్తనాల నుంచి మార్కెట్ వరకు రైతుల ప్రయోజనం కోసం మేము లెక్కలేనన్ని సంస్కరణలు అమ‌లు చేశాము. ఆ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని ప్ర‌ధాని వివ‌రించారు.

PM Modi | ఎగుమ‌తులు రెట్టింపు..

ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో దిగుబ‌డులు పెరిగాయ‌ని ప్ర‌ధాని తెలిపారు. దేశ వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గ‌తం కంటే ధాన్యం ఎగుమ‌తులు దాదాపు 90 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నులు, పండ్లు, కూరగాయల ఉత్పత్తుల ఎగుమ‌తులు 64 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింద‌న్నారు. 2014 నుండి భారతదేశం నుంచి తేనె ఉత్పత్తి కూడా రెట్టింపు అయిందని వివ‌రించారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి రంగంలో నిరంతరం మెరుగుపడాల్సిన అవసరం ఉందని ప్ర‌ధాని నొక్కి చెప్పారు. దేశ స్వభావం కొన్ని విజయాలతో సంతృప్తి చెందని విధంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. “అణగారిన వారికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారించినప్పుడు, ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. నేడు, మాతృ మరణాలు తగ్గాయి, పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది విద్యా ప్రమాణాలు పెరిగాయి” అని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో ప్రస్తుతం వెనుకబడిన 100 జిల్లాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. తద్వారా వారు మరింత అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీ పడగలరన్నారు.