అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్వర్ణయుగంగా విరాజిల్లిన ఆర్మూర్ నియోజకవర్గం (Armoor constituency) కాంగ్రెస్ సర్కార్ పాలనలో అధోగతిపాలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Jeevan Reddy) మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆదివారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ఏం చేశారో కాంగ్రెస్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి (BJP MLA Rakesh Reddy) చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిర్వాకం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజాసంక్షేమం మాయం కాగా కాంగ్రెస్ అధికార దురంహకారానికి పాల్పడుతోందని విమర్శించారు.
రెండేళ్లలోనే ఆర్మూర్ అభివృద్ధి ఆమడ దూరం వెనక్కి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ ది అవినీతి, బీజేపీది దుర్నీతి’ అన్నారు. ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్‌కు శాపంగా మారారని విమర్శించారు. ఆర్మూర్ అభివృద్ధికి అణాపైసా తేలేని దద్దమ్మలు కాంగ్రెస్, బీజేపీల నాయకులు ఏం చూసుకుని ఆర్మూర్ పట్టణంలో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఆర్మూర్‌కు స్వర్ణయుగమన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దాదాపు రూ.3వేల కోట్ల నిధులు సాధించి ఆర్మూర్ నియోజక వర్గాన్ని తీర్చిదిద్దిన చరిత్ర తనదన్నారు. ఆర్మూర్ నియోజక వర్గంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవేనని.. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పథకాలనూ తామే తెచ్చామని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు.
Ex Mla Jeevan Reddy | ఒక్క పథకం పేరు చెప్పగలరా..
పదేళ్లలో తాను సాధించిన వంద పథకాల పేర్లు గుక్కతిప్పుకోకుండా చెప్పగలనని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సిడీలే (electricity subsidies) రూ.320 కోట్లు వచ్చాయని.. నియోజకవర్గంలో 62వేల మందికి రూ.2016, రూ.4016 చొప్పున ఆసరా పెన్షన్లు అందజేశామన్నారు. 62 వేల మందికి రైతుబంధు (Rythu Bandhu) ద్వారా పెట్టుబడి సాయం ఇప్పించానని స్పష్టం చేశారు.
Ex Mla Jeevan Reddy | దళితబంధు..
దళితబంధు స్కీమ్ (Dalit Bandhu scheme) ద్వారా 12వందల మందికి రూ.10 లక్షల చొప్పున యూనిట్లు ఇచ్చామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పటి కేసీఆర్ సర్కారుకు సకల కులాలూ సమానమేనని ఆయన వెల్లడించారు. ఒక్క ఆర్మూర్ పట్టణంలోనే రూ.100 కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మించానన్నారు. పట్టణంలో రోడ్డు లేని గల్లీ లేదని చెప్పారు.
పట్టణంలో డివైడర్లు నిర్మించి పదేళ్ల పాటు పెంచిన చెట్లను కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి తొలగించడం దారుణమన్నారు. జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, రాజేశ్వర్ రెడ్డి, మీర శ్రావణ్, పృధ్వీ, గణేష్, అజీమ్, అభిలాష్, లతీఫ్, రహమత్, సత్తర్ తదితరులు పాల్గొన్నారు.