అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కారుకు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని రహమత్ నగర్లో సోమవారం బీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-Election) నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. నామినేషన్లు సైతం స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రహమత్ నగర్లో (Rahmat Nagar) భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు పక్కా అన్నారు. మెజారిటీ ఎంత అన్నదే లేలాలన్నారు. ఉప ఎన్నికలు బీఆర్ఎస్కు కొత్త కాదని చెప్పారు.
KTR | కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
జూబ్లీహిల్స్‌లో పోరు ప్రారంభం అయిందని కేటీఆర్ అన్నారు. ప్రజలు రేవంత్‌రెడ్డిని తిడుతున్నారని ఎద్దేవా చేశారు. తమను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలకు అవకాశం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ మోసాలను వివరించాలన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో వివరించాలన్నారు.
KTR | నెల రోజులు కష్టపడాలి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతుందని కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల ఇళ్లకు కారు రావాలా.. బుల్డోజర్ రావాలా తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే హైడ్రా బుల్డోజర్లు ఇళ్లను కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్లు అని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు. హైడ్రా (Hydraa) పేరుతో పేదలను రోడ్ల మీదకు తెచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేశారన్నారు. రాష్ట్రమంతటా ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కు (Congress) బుద్ధి చెబితే హామీలు అమలు అవుతాయన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం నెల రోజులు కష్టపడాలని ఆయన కోరారు.
KTR | హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలి
హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజల ఇళ్ల మీదకి బుల్డోజర్లు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికలతో సురుకు తగలాలని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఆయన కోరారు. లేదంటే హామీలు అమలు చేయకున్నా తననే గెలిపించారని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇంకా ఏ పని చేయడని చెప్పారు.
KTR | నల్లా బిల్లులు కట్టొద్దు
కేసీఆర్ ప్రభుత్వంలో ఇంట్లో ఉండే నల్లా బిల్లులు మాఫీ చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కానీ ఇప్పుడు బలవంతంగా బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు నల్లా బిల్లులు కట్టొద్దని ఆయన సూచించారు. ప్రజల వెనుక తాము ఉన్నామని చెప్పారు.