అక్షరటుడే, వెబ్డెస్క్ : Medaram Jathara | మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులతో సమీక్షించారు. పనులు నాణ్యతతో వేగవంతంగా చేయాలని ఆదేశించారు.
ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనుంది. సమ్మక్క–సారక్క జాతర నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పనులపై సీఎం రేవంత్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ (Konda Surekha), అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
Medaram Jathara | నాణ్యత పాటించాలి
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం (CM Revanth Reddy) ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి ఉండే ప్రదేశాల విషయంలో పనులు పక్కాగా చేపట్టాలని సూచించారు.
Medaram Jathara | సకాలంలో పూర్తి చేయాలి
పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్దపీట వేయాలన్నారు. నిర్దేశిత సమయంలోనే పనులు పూర్తి కావాలని ఆదేశించారు. గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దని సూచించారు. గుడి చుట్టు పచ్చదనం అభివృద్ధి చేయాలన్నారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ గారు తదితరులు పాల్గొన్నారు.
